జిల్లాలు, రెవెన్యూ డివిజిన్లు, మండలాల పునర్విభజనతో ఏర్పాటైన కొత్త మండలం అబ్దుల్లాపూర్ మెట్. దీనికి తొలి తహసీల్దార్ విజయారెడ్డి. అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఏర్పాటుకు ముందు.. ఈ మండల పరిధిలోని 35 గ్రామాలతో పాటు హయత్‌నగర్ పరిధి ఆరు గ్రామాలతో కలిపి హయత్‌నగర్ మండలంగా కొనసాగింది. ఇది పూర్వ సరూర్‌నగర్ పరిధిలోకి వచ్చేది. రెవెన్యూ డివిజన్ మండలాల పునర్విభజన తరువాత హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్ వేర్వేరుగా ఏర్పాటయ్యాయి. హయత్‌నగర్ రెవెన్యూ డివిజన్‌గా ఆవిర్భవించింది.
బదిలీకి దరఖాస్తు.. అంతలోనే ఇలా!
"ఇటీవలే మేడం బడిలీ కోసం దరఖాస్తు చేశారు. మూడేళ్లుగా ఇక్కడే ఉన్నారు కదా.. వేరొక చోటుకు వెళ్లాలనుకునేవారు". అని అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ కార్యాలయ సిబ్బంది చెప్పారు. విజయారెడ్డి మూడేళ్ల క్రితం మల్కాజ్గిరి మండలం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారని పేర్కొన్నారు. అక్టోబర్ 11న తహసీల్దారుగా నియమితులయ్యారని, బదిలీ కోసం మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.