నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రేపు రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు పలు రహదారులపై ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా వాహనాల రాకపోకలను నిషేధించారు.
రేపు రాత్రి సంబురాలు జరుపుకోవడానికి నగరవాసులు పెద్దఎత్తున నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ మీదికి వచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకల నిలిపివేయనున్నారు. ఈ మార్గం మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయదారుల మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. బాహ్యవలయ రహదారిపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కార్లు, జీపులకు అనుమతి నిరాకరించారు.
శంషాబాద్ వెళ్లే వారికి..
పీవీ ఎక్స్‌ప్రెస్ వే పైనా వాహనాల రాకపోకలకు అనుమతి లేదు. కేవలం శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వారికి మాత్రమే బాహ్యవలయ రహదారి మీద వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. బాహ్యవలయ రహదారి మీదుగా లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు యథాతథంగా ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పై వంతెనల మీద రాకపోకలు నిలిపివేయనున్నారు.
ఫ్లై ఓవర్ల మూసివేత...
గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్లను రేపు రాత్రి మూసివేయనున్నారు. కామినేని, ఎల్బీనగర్ ఫ్లైఓవర్, చింతల్‌కుంట అండర్ పాస్‌లు మూసివేస్తారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్, నల్గొండ చౌరస్తాపై వంతెన, పంజాగుట్ట ప్లైఓవర్ మూసివేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాల వేగాన్ని నియంత్రించడం కోసం పలు చోట్ల పోలీసులు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ఇవీ చూడండి: డిసెంబర్ 31న మందుబాబులకు మెట్రో స్పెషల్ ఆఫర్