Telangana Tourism: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం పర్యాటకానికి పెట్టిన పేరుగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త ఆవిష్కరణలు, కట్టడాలతో రాష్ట్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తుగల అంబేడ్కర్ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైనది. అలాగే తెలంగాణ కళాసంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర సచివాలయం.. ఇవన్నీ రాష్ట్ర రాజధానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఇవేగాక నెక్లెస్‌రోడ్డులో, ట్యాంక్‌బండ్‌కు సమీపంలో నీరా కేఫ్ ప్రారంభమైంది. వీటికి సమీపంలోనే త్వరలో అమరవీరులు స్మారక కేంద్రం ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ అనేక కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. వీటిలో భాగంగా ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల్లో సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాలను వినోదం, టూరిస్ట్ కేంద్రాలుగా తీర్చిదిద్దే ఆలోచన కార్యరూపం దాల్చనుంది. టూరిస్ట్‌ల వసతికి కొత్తగా ఐదు బడ్జెట్ హోటళ్లను పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించబోతుంది. ఒక్కో హోటల్లో సుమారు 20 గదులుంటాయి. నిర్మాణం చివరి దశలో ఉన్న బడ్జెట్ హోటల్, ఒక రిసార్టు అందుబాటులోకి రానున్నాయి. మహాబూబ్‌నగర్, సిద్దిపేటలో శిల్పారామాలు ఏర్పాటు చేయనున్నారు.
ఐటీ, విదేశీ పర్యాటకులు లక్ష్యంగా:రూ.110కోట్ల వ్యయంతో రంగనాయకసాగర్‌ను సిద్దిపేటకు 10కిలోమీటర్లు దూరంలో అభివృద్ధి చేయనున్నారు. రంగనాయకసాగర్ జలాశయాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు.ఈ ప్రాజెక్టును ప్రధానంగా విదేశీ పర్యాటకులను, ఐటీ ఉద్యోగులను ఆకర్షించే లక్ష్యంగా ఏర్పాటుచేశారు. జల వినోదం కోసం వాటర్ రిసార్టులు, వాటర్ ఫ్రంట్ ఫుడ్ కోర్ట్, ఒకేసారి 2వేస మందికి సరిపడా కాన్ఫరెన్స్ హాలు, పిల్లలకు ప్రత్యేకంగా వాటర్ పార్కులు వంటి అనేక ఆకర్షణలు ఇక్కడ రాబోతున్నాయని టూరిజం కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి.