తెలంగాణ

telangana

ETV Bharat / state

తక్కువ ఖర్చుతో కరోనా పరీక్ష.. 2 నూతన పద్ధతులు అభివృద్ధి - సీసీఎంబీ తాజా వార్తలు

తక్కువ ఖర్చుతో కొవిడ్‌ పరీక్షలు చేసే రెండు పద్ధతులను సీసీఎంబీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. నెలరోజుల క్రితం వీటిని ఐసీఎంఆర్‌ ధ్రువీకరణకు పంపారు. వారి నుంచి అనుమతి వస్తే కరోనా పరీక్షల విధానంలో సమూలంగా మార్పులు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

తక్కువ ఖర్చుతో కరోనా పరీక్ష.. 2 నూతన పద్ధతులు అభివృద్ధి
తక్కువ ఖర్చుతో కరోనా పరీక్ష.. 2 నూతన పద్ధతులు అభివృద్ధి

By

Published : Jul 11, 2020, 8:13 AM IST

తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, కచ్చితత్వంతో కరోనా పరీక్షలు చేసే రెండు ప్రత్యామ్నాయ పద్ధతులను సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు అభివృద్ధి చేశారు. నెలరోజుల క్రితం వీటిని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ధ్రువీకరణకు పంపారు. వారి నుంచి అనుమతి వస్తే కరోనా పరీక్షల విధానంలో సమూలంగా మార్పులు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

కరోనా నిర్ధరణ కోసం ప్రస్తుతం చేస్తున్న రియల్‌టైమ్‌ క్వాంటిటేటివ్‌ రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ-క్యూ పీసీఆర్‌) విధానంలో ఎక్కువ సమయం పడుతున్నందున అందరికీ పరీక్షలు చేయలేకపోతున్నారు. పైగా ఈ యంత్రాలు ఖరీదైనవి. పరిమితంగా ఉన్నాయి. ఇందులోని క్లిష్టతలను దృష్టిలో పెట్టుకుని సీసీఎంబీ పరిశోధకులు నెల రోజుల క్రితం రెండు కొత్త పద్ధతులను అభివృద్ధి చేశారు.

సంస్థలు పెరిగినా..

కొవిడ్‌కు ముందు వైద్యానికి సంబంధించి సాంకేతికతను ధ్రువీకరించడానికి కేవలం ఐసీఎంఆర్‌కు మాత్రమే అధికారం ఉండేది. అత్యవసర పరిస్థితుల్లో దేశీయంగా సాంకేతికతను ప్రోత్సహించేందుకు, మన అవసరాలకు తగ్గ పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు దశలవారీగా 12 సంస్థలకు ఈ అధికారం కట్టబెట్టారు. సీసీఎంబీకి సైతం ఈ అధికారం ఉంది. అయితే కరోనా నిర్ధరణ పరీక్షల కొత్త పద్ధతులను తామే అభివృద్ధి చేసినందున ఐసీఎంఆర్‌కు పంపారు. వీరు పరిశీలించి కచ్చితత్వంపై సంతృప్తి చెందిన తర్వాతే అనుమతి ఇస్తారు. ప్రస్తుతం ఈ అంగీకార ప్రక్రియే ఆలస్యమవుతోంది.

* కరోనా వైరస్‌ ఉందో లేదో గుర్తించేందుకు ఆర్‌టీ-పీసీఆర్‌పై ప్రస్తుతం చేస్తున్న విధానంలో పలు దశలు ఉండటంవల్ల గంటల సమయం తీసుకుంటోంది. ఖర్చు కూడా ఎక్కువే.

* సీసీఎంబీ కొత్తగా అభివృద్ధి చేసిన ఒక పద్ధతి ప్రకారమైతే సేకరించిన నమూనాలను ఎలాంటి రసాయన ద్రవంలో కలపరు. ఆర్‌ఎన్‌ఏ ప్రక్రియ లేకుండా నేరుగా పీసీఆర్‌పై పరీక్షిస్తారు. రెండున్నర గంటల్లోనే ఫలితాలు వస్తాయి.

* ప్రస్తుతం కరోనా నిర్ధరణ పరీక్షల కోసం ఉపయోగించే ప్రొబ్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ ప్రొబ్స్‌ అవసరం లేకుండానే నేరుగా పీసీఆర్‌పై పరీక్షించే మరో పద్ధతిని సీసీఎంబీ అభివృద్ధి చేసింది. దీనిని నెస్టెడ్‌ పీసీఆర్‌గా పిలుస్తున్నారు. ఈ పరీక్ష కిట్లు ప్రతి డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లోనూ ఉంటాయి. ఐసీఎంఆర్‌ అనుమతి ఇస్తే మన ఇంటి సమీపంలో ఉన్న కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వీలుంటుంది.

ఇవీ చూడండి:సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ABOUT THE AUTHOR

...view details