ఇద్దరికి శిరస్త్రాణం.. త్వరలో కొత్త నిబంధన ఏటా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో ద్విచక్ర వాహదారులే అధికంగా ఉంటున్నారు. శిరస్త్రాణం ధరించకపోవడం, మితిమీరిన వేగం ఇందుకు ప్రధాన కారణమంటున్న పోలీసు ఉన్నతాధికారులు... ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గించడానికి తగు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి కొత్త విధానం అందుబాటులోకి తేనున్నారు. జంటనగరాల్లో ప్రస్తుతం ద్విచక్ర వాహనదారులు విధిగా శిరస్త్రాణం ధరించాలి... లేకుంటే జరిమానాలు విధిస్తారు. దాదాపుగా ద్విచక్ర వాహనంతో రోడ్డెక్కిన వారంతా... శిరస్త్రాణం లేకుండా బయటకు రావడం లేదు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తే.. ఇద్దరూ శిరస్త్రాణం ధరించే విధంగా కొత్త విధానం అమలు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
చైన్నై, బెంగళూరు తరహాలో..
ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా హైదరాబాద్‌లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ఇద్దరు శిరస్త్రాణాలు విధిగా ధరించాలనే నిబంధన త్వరలో రానుంది. చెన్నై, బెంగళూరు తరహాలో నగరంలో కూడా ఈ నియమాన్ని తీసుకురానున్నారు. మూడు కమిషనరేట్లలో దశల వారీగా అమలు చేయనున్నారు. పురపాలక ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త నియమాన్ని అందుబాటులోకి తేవాలని పోలీసులు భావిస్తున్నారు.
మృతులు, క్షతగాత్రుల సంఖ్య తగ్గించవచ్చు:
ఇందుకోసం ముందుగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించనున్నారు. మొత్తంగా మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో వాహనాలపై ప్రయాణించే ఇద్దరు శిరస్త్రాణం ధరించే విధంగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు. కొత్త విధానం వల్ల ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య తగ్గించవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: