Telangana New Secretariat: తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు అత్యాధునిక హంగులతో సరికొత్త ప్రాంగణం సంసిద్ధమైంది. రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్ తీరాన.. ధవళ వర్ణ కాంతులతో దగదగలాడుతూ ఇంద్ర భవనాన్ని తలిపిస్తున్న కొత్త సచివాలయ భవనం చరిత్రలో అద్భుత కట్టడంగా నిలవబోతోంది. తెలంగాణ ఠీవిని ప్రతిబింబించేలా నూతన సచివాలయం రూపుదిద్దుకుంది. చారిత్రక వారసత్వ సంపదకు ఆలవాలమైన భాగ్యనగరం సిగలో ఇది మరో మకుటంగా నిలవనుంది.
హిందూ.. దక్కనీ.. కాకతీయ నిర్మాణ రీతులు.. సువిశాలమైన ప్రాంగణంలో ఆకాశహర్మ్యాలు.. రెండు గుమ్మటాలపై జాతీయ చిహ్నాలైన మూడు సింహాలతో తెలంగాణ ఆత్మగౌరవ పతాకంలా నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవనం తళుకులీనుతోంది. దాదాపు రూ.617 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమైన ఈ అద్భుత కట్టడం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం పేరుతో తెలంగాణ ప్రజలకు సేవలందించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు కొత్తగా నిర్మించిన ఈ భవనంలో మొదలు కానున్నట్లు సమాచారం.
భారీ సచివాలయంగా రికార్డుల్లోకి :ఇటీవల కాలంలో దేశంలో నిర్మించిన సచివాలయ భవనాల్లో తెలంగాణ నిర్మించిన ఈ నూతన ప్రాంగణమే అగ్రగామిగా నిలవనుంది. రెండు రాష్ట్రాలు గడచిన పదేళ్లలో నూతన సచివాలయాలను నిర్మించాయి. వాటిలో మహానది భవన్ పేరిట 2012లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 6.75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయాన్ని నిర్మించగా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2018లో వల్లభ్ భవన్ పేరుతో 9 లక్షల చదరపుటడుగుల్లో నూతన భవనాన్ని రూపొందించింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన కొత్త సచివాలయం భారీ నిర్మాణంగా రికార్డులకు ఎక్కనుంది.