రాష్ట్రంలో కొత్తగా తెచ్చే రెవెన్యూ చట్టానికి పక్కా సాంకేతిక వ్యవస్థ అనుసంధానంతో ప్రజలకు చాలా చిక్కులు తప్పనున్నాయి. ప్రభుత్వం దీనిపై కసరత్తు ముమ్మరం చేసింది. క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థలో మార్పులు రానున్నాయి. ఈ క్రమంలో రెవెన్యూ సంఘాల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెండు రోజుల్లో సంఘ నాయకులతో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేపట్టబోయే మార్పులను వారికి వివరించి సూచనలను ఆహ్వానిస్తారు.
ఆటోమెటిక్ పద్ధతిలో మ్యుటేషన్
భూ దస్త్రాల్లో నిత్యం జరిగే మ్యుటేషన్ (యాజమాన్య హక్కు బదిలీ) ప్రక్రియ అంతా ఆటోమెటిక్ పద్ధతిలో పూర్తయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భూ క్రయవిక్రయాల అనంతరం భూ యాజమాన్య హక్కులు అమ్మిన రైతు నుంచి కొనుగోలు చేసిన రైతు పేరుపై సులువుగా మారేందుకు సాంకేతిక సేవలు వినియోగించనున్నారు. మ్యుటేషన్ ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తయ్యేలా మార్పులు తెచ్చేందుకు అనువైన విధానాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే 96 శాతం భూ దస్త్రాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయగా మిగిలినవి కూడా పూర్తిచేసి ధరణి పోర్టల్ వేదికగా సేవలు అందించేందుకు వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. కోర్ బ్యాంకింగ్ సేవల తరహాలోనే మ్యుటేషన్ పూర్తి కావాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.