తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్​లైన్​ బోధనలోనూ కొత్తపుంతలు.. సిద్ధమవుతున్న విద్యాసంస్థలు

కరోనా పరిస్థితులతో ఆన్​లైన్​ బోధన అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆ విధానం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. బ్లాక్​బోర్డు, చాక్​పీసులు కనుమరుగై.. డిజిటల్ ​తెరలు.. టూడీ, త్రీడీ, గ్రాఫిక్స్​ రూపంలో బోధన రూపుదిద్దుకుంటోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో చేసే బోధన... విద్యార్థులను సైతం అమితంగా ఆకట్టుకుంటోంది.

new technologies in teaching
new technologies in teaching

By

Published : Aug 13, 2020, 7:26 AM IST

కరోనా ప్రభావంతో కేజీ టూ పీజీకి సంబంధించి... విద్యా బోధనలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్​లైన్​ పాఠాలు మొదలుపెట్టిన విద్యా సంస్థలు... వాటికి ఆధునికతను జోడిస్తున్నాయి. విద్యా సంస్థలు ప్రారంభమైన అనంతరం ఉపయోగపడేలా... డిజిటల్ కంటెంట్​ను సమకూర్చుకుంటున్నాయి. దీనికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో.. పిల్లలకు డిజిటల్​ పాఠ్యాంశాలను రూపొందిస్తున్నాయి.

నూతన పద్ధతుల్లో బోధన...

ప్రస్తుతం బ్లాక్ బోర్డు ఆధారంగా బోధిస్తున్న పాఠాలను... కెమెరా లేదా మొబైల్ ఫోన్లో వీడియో చిత్రీకరించి.. విద్యార్థులకు చేరవేస్తున్నారు. జూమ్, గూగుల్ మెట్, వెబెక్స్ వంటి యాప్స్ ద్వారా ప్రత్యక్షంగా బోధిస్తున్నప్పుడు.. మధ్యలో అవసరమైన వీడియోలను ప్రదర్శిస్తున్నారు. ఐతే... వీడియోలు ప్రదర్శించినప్పడు... ఉపాధ్యాయుడు కనిపించడం లేదు. ముందుగా ప్రదర్శించి.. ఆ తర్వాత ఉపాధ్యాయుడు వాటి గురించి వివరిస్తున్నారు. వీటిని అధిగమించేందుకు నూతన పద్ధతులను వెతుకుతున్నామని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమర్థవంతంగా...

ఆన్​లైన్ తరగతులను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా.. టూడీ, త్రీడీ యానిమేషన్, గ్రాఫిక్స్ జోడించి పాఠ్యాంశాలను డిజిటల్ కంటెంట్​గా రూపొందిస్తున్నారు. పాఠాల్లోని జంతువులు, మొక్కల వంటివన్నీ విద్యార్థులకు కళ్ల ముందే కదులుతున్నట్లుగా తయారు చేస్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి... పాఠ్యాంశాలను సిద్ధం చేస్తున్నారు.

బోధనే కాదు... పరీక్షలు కూడా...

సాధారణంగా యూట్యూబ్​లో ఎవరో చెబుతున్న పాఠాలు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అర్థం కాకపోవచ్చు. అదే డిజిటల్​రూపంలో.. రోజూ పాఠశాల లేదా కళాశాలలో బోధించే ఉపాధ్యాయుడే చెప్పేలా తీర్చిదిద్దుతున్నారు. కేవలం బోధనకే పరిమితం కాకుండా...ఆన్​లైన్లో పరీక్షలు నిర్వహించి.. మూల్యాంకనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు సైతం డిజిటల్​ తెరల ద్వారా నమోదు చేసే సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

విద్యా సంస్థలు ప్రారంభమయ్యాక సైతం డిజిటల్ తరగతులను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీనికి అనుగుణంగా కంటెంట్​ రూపొందించేందుకు పరిశోధనలు సాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details