తెలంగాణ గొప్ప చరిత్ర, హైదరాబాద్ ఘనమైన వారసత్వం, సమున్నత సంస్కృతీసంప్రదాయాలు వాటన్నింటినీ ప్రతిబింబించేలా కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. ఈ మేరకు సమీకృత సచివాలయ భవన నమూనా ఖరారైంది. చెన్నైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు ఆస్కార్, పొన్ని... ఆ నమూనాను తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్మాణాలకు చెందిన నమూనాలను అందించారు ఆ ఆర్కిటెక్ట్ భార్యాభర్తలు. దక్షిణ భారతదేశ సంప్రదాయానికి అనుగుణంగా దక్కన్ కాకతీయ నిర్మాణశైలిలో భవన నమూనా సిద్ధం చేశారు. ఓ చారిత్రక కట్టడాన్ని తలపించేలా నమూనాను రూపొందించారు.
మొత్తం వ్యవస్థ ఒకేచోట..
25 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన పచ్చికబయలుతో సచివాలయ భవన నిర్మాణం రానుంది. హుస్సేన్‌సాగర్‌కు అభిముఖంగా 6 అంతస్తుల్లో... 6 నుంచి 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమీకృత భవనాన్ని నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి... మంత్రుల కార్యాలయాలు, పేషీలు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, విభాగాలన్నింటినీ అనుసంధానించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఒక శాఖకు చెందిన మొత్తం వ్యవస్థ ఒకే చోట ఉండేలా ప్రణాళిక రూపొందించనున్నారు. విశాలమైన సమావేశ మందిరాలు, హాళ్లు, వరండాలతో నిర్మించనున్నారు.
అన్ని హంగులతో..
అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి లోపాలు లేకుండా అత్యాధునిక హంగులతో భవనాన్ని నిర్మించనున్నారు. సమీకృత భవనాన్ని కేవలం సచివాలయ కార్యాలయాల కోసం మాత్రమే నిర్మితమవుతుంది. బ్యాంకులు, తపాలా కార్యాలయం, శిశు సంరక్షణా కేంద్రం, ఆసుపత్రి, క్యాంటీన్లు, ప్రార్థనా మందిరాల్ని దక్షిణం వైపు విడిగా నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులకు ఉత్తరం వైపు, ఉద్యోగులకు తూర్పు దిశలో సందర్శకులకు దక్షిణం వైపు ప్రత్యేకంగా ప్రవేశద్వారాలు ఏర్పాటు చేస్తారు.