Telangana New Secretariat Inauguration On April 30th: రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవ ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 30 వ తేదీన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. గడువు సమీపించిన తరుణంలో పూర్తి చేయాల్సిన పనులను శర వేగవంతం పూర్తి చేశారు. మిగిలిన చిన్న చిన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. భవనంతో పాటు ప్రాంగణాన్ని ప్రారంభోత్సవానికి ముస్తాబు చేస్తున్నారు.
Telangana New Secretariat Inauguration : కొన్ని అంతస్తుల్లో ఫర్నీచర్ ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్తుతో పాటు కొన్ని అంతస్తుల్లో ఫర్నీచర్ సంబంధిత పనులన్నీ పూర్తి కాగా.. మిగతా వాటి పనులు వేగంగా సాగుతున్నాయి. భవనానికి దక్షిణం వైపు భారీ గుమ్మటం కింద లాంజ్ సహా ఇతరత్రా పనులు కొనసాగుతున్నాయి. ఫినిషింగ్, క్లీనింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి రోజుకు రెండు మార్లు పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు.
Telangana New Secretariat : ఈ నెల 30 వ తేదీ మధ్యాహ్నం ప్రారంభోత్సవం జరగనుండగా.. ఆ రోజు ఉదయం నుంచే యాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం సచివాలయ ప్రాంగణంలో తాత్కాలిక యాగశాల ఏర్పాటు చేస్తున్నారు. సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. సచివాలయం వెలుపల రహదారి అభివృద్ధి పనులతో పాటు ఐల్యాండ్ తరహాలో ల్యాండ్ స్కేపింగ్ పనులు కుడా వేగంగా జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలను అక్కడి నుంచి తరలించారు. బీఆర్కే భవన్ వద్ద స్టీల్ బ్రిడ్జ్‌తో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.