రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళన కార్యక్రమం మొదలవటం వల్ల ఇవాళ్టి నుంచి పూర్తిగా రిజిస్ట్రేషన్లు ఆపేశారు. కొత్తగా తెస్తున్న రెవెన్యూ చట్టానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ శాఖను కూడా పునర్ వ్యవస్థీకరణ చేయనుంది. అందులో భాగంగా... రెవెన్యూ శాఖనే ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయనుండగా.. వ్యవసాయేతర భూములు, భవనాలు, వివాహాలు వంటి రిజిస్ట్రేషన్లకే రిజిస్ట్రేషన్ల శాఖ పరిమితం కానుంది.
రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా... అందులో 20కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములే అధికంగా రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వాటిని పూర్తిగా రద్దు చేసి...ఆ కార్యాలయాలను స్థిరాస్థి క్రయవిక్రయాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడమా....లేక అక్కడి సిబ్బందిని పని ఒత్తిడి అధికంగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు సర్దుబాటు చేయడమా అన్న అంశంపై రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేస్తోంది.