రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీపై సర్కారు దృష్టి సారించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించి.. కొత్త రేషన్‌కార్డులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు పెద్దసంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అందులో కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా.. ప్రస్తుతం 4.97 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాల్లో రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరతకు తోడు పౌర సరఫరాల శాఖ సకాలంలో ఆ కసరత్తు పూర్తి చేయకపోవడంతో జాప్యం నెలకొంది.
కొత్త రేషన్ రేషన్ కార్డుల డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో త్వరలో జారీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వెల్లడించారు. అనంతరం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ అంశంపై విస్తృతంగా చర్చించి విధివిధానాలు ఖరారు చేసిన నివేదిక సమర్పించాలని కోరింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.