TS Mandali Protem chairman : శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా మెదక్ జిల్లా స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఛైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీకాలం గతేడాది జూన్ మూడో తేదీతో ముగిసింది. అప్పట్లో కొత్త ఛైర్మన్ ఎన్నికతో పాటు ఖాళీ అయిన స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సభలో సీనియర్ సభ్యుడైన భూపాల్ రెడ్డిని ప్రొటెం ఛైర్మన్‌గా నియమించారు. అప్పటి నుంచి ఆయనే మండలి కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నారు. అయితే భూపాల్ రెడ్డి పదవీకాలం కూడా ఈ నెల నాలుగో తేదీతో ముగియనుంది. ఆయన తిరిగి పెద్దల సభకు ఎన్నిక కాలేదు. దీంతో మండలి కార్యకలాపాలు పర్యవేక్షించేవారు లేకుండా పోతారు. ఈలోగా ఛైర్మన్ కోసం ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు.
నాలుగోతేదీన నోటిఫికేషన్...!
స్థానికసంస్థల కోటా నుంచి ఇటీవల ఎన్నికైన 12 మంది సభ్యుల పదవీకాలం ఐదో తేదీతో ప్రారంభం కానుంది. ఆ రోజు తర్వాత వారు పెద్దలసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం ఒకవేళ నిర్ణయించినా వారి ప్రమాణస్వీకారం తర్వాతే ఉండే అవకాశం ఉంది. దీంతో మండలి రోజువారీ కార్యకలాపాలు నిర్వర్తించేందుకు వీలుగా మరొకరిని ప్రొటెం ఛైర్మన్‌గా నియమించనున్నారు. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో సీనియర్‌గా ఉన్న ఒకరిని ప్రొటెం ఛైర్మన్‌గా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎమ్మెల్సీగా భూపాల్ రెడ్డి పదవీకాలం నాలుగోతేదీన ముగియనున్న నేపథ్యంలో ప్రొటెం ఛైర్మన్ నియామకానికి సంబంధించి అదే రోజు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఆ రోజు నుంచి కొత్త ఛైర్మన్ ఎన్నికయ్యే వరకు మండలి కార్యకలాపాలను ప్రొటెం ఛైర్మన్ పర్యవేక్షిస్తారు.
ఇదీ చూడండి:Minister errabelli: 'బహిర్భూమి రహిత ఆవాసాల్లో ఔత్సాహిక మోడల్‌గా తెలంగాణ'