New Postings for IAS Officers in Telangana :విద్యుత్ శాఖలో కీలక బాధ్యతల్లో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించడంతో పాటు, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ట్రాన్స్ కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ ఫారూఖీని, టీఎస్ఎన్ పీడీసీఎల్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి కీలక బాధ్యతలు కేటాయించారు. ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం, మూసీ నది అభివృద్ధి సంస్థ ఇంఛార్జి ఎండీగా అదనపు బాధ్యతలను కేటాయించారు. వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా, ప్రజారోగ్య కమిషనర్‌గా శైలజ రామయ్యర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓఎస్డీగా డి.కృష్ణభాస్కర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా బి.గోపీ నియమితులయ్యారు.
స్థానచలనం పొందిన ఐఏఎస్‌లు వీరే :
- హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్- ఆమ్రపాలి
- మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌ఛార్జి ఎండీగా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
- ఇంధన శాఖ కార్యదర్శి- సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ
- ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రిజ్వికి అదనపు బాధ్యతలు
- ట్రాన్స్‌కో సంయుక్త ఎండీ- సందీప్‌కుమార్ ఝా
- ఉప ముఖ్యమంత్రి ఓఎస్‌డీ- కృష్ణ భాస్కర్
- దక్షిణ డిస్కమ్ సీఎండీ- ముషారఫ్‌అలీ
- ఉత్తర డిస్కమ్ సీఎండీ- కర్ణాటి వరుణ్ రెడ్డి
- వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి- శైలజా రామయ్యర్
- వ్యవసాయ శాఖ డైరెక్టర్- బి.గోపి
రిజ్వీకి కీలక బాధ్యతలు :తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ ట్రాన్స్ కో సీఎండీగాను, ఎస్‌పీడీసీఎల్(SPDCL) సీఎండీగాను పనిచేశారు. అప్పట్లో ఆయన అధికారులను పరుగులు పెట్టించేవారు. అలాగే సరిగా పనిచేయని ఒక డిస్కం(విద్యుత్ పంపిణీ సంస్థ) డైరెక్టర్‌ను రిజ్వీ నిలదీయడంతో ఆయన సెలవుపై వెళ్లారు. అయితే ఏడాదిలోపే ముర్తజా రిజ్వీ బదిలీ అయ్యారు.