తెలంగాణ రాష్ట్ర ప్రాధామ్య రంగాల్లో ఐటీరంగం ముందుంటుంది. వార్షిక వృద్ధి, ఐటీ ఎగుమతులు ఇలా అన్నింటా దేశ సగటును మించిన వృద్ధిని రాష్ట్ర ఐటీ రంగం నమోదు చేస్తూ వస్తోంది. రాష్ట్ర ఐటీరంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా 6.5 లక్షల మంది ఉద్యోగులు, పరోక్షంగా 20 లక్షల మంది వేతన జీవులు ఉపాధి పొందుతున్నారు. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఐటీరంగం మెరుగైన ఫలితాలనే పునరావృతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. చిన్న, మధ్యతరహా కంపెనీలతో పాటు.. గ్లోబల్ ఇన్ హౌస్ దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల విధానాలు, వేగవంత అనుమతులతో పాటు.. ఆయా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేలా ప్రత్యేక పాలసీలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది.
కొవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నా.. ప్రొడక్టివిటీ, ఎగుమతులు ఏమాత్రం తగ్గకుండా తెలంగాణ ఐటీరంగం జాతీయ సగటును మించిన వృద్ధిని సాధించింది. ఈ ఏడాది ఐటీ రంగం 12.98 శాతం వృద్ధితో.. లక్ష 45 వేల 522 కోట్ల ఎగుమతులు జరిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఐటీ వార్షిక నివేదికలో పేర్కొంది. 2020-21 సంవత్సరానికి గానూ ఐటీ రంగం, అనుబంధ సేవల ద్వారా 7.99 శాతం ఉద్యోగిత పెరిగింది. అంటే ఏడాది కాలంలో కొత్తగా 46 వేల 489 ఉద్యోగాలను ఐటీ రంగం కల్పించింది.