హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్థిష్టమైన మానవ వనరుల ప్రణాళిక, తదితర అంశాలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్షించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీ అమలు చేయనున్నామని తెలిపారు.
హెచ్‌ఆర్ విధానానికి సంబంధించి కమిటీ వెంటనే నివేదిక సమర్పించినట్లైతే... ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. ఇది అమల్లోకి వస్తే 800 పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న 2,500 మందికిపైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పదోన్నతులు లేవన్నారు.