భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి యజమానులకు ఇబ్బందులు తప్పనున్నాయి. దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణానికి అనుమతులు జారీ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంస్కరణ టీఎస్-బీపాస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కొత్త విధానం వల్ల 75 గజాల స్థలంలో నిర్మించే భవనాలకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. రూపాయి చెల్లించి టీఎస్-బీపాస్ కింద నమోదు చేసుకోవచ్చు.
స్వీయ ధ్రువీకరణ ద్వారానే
600 గజాల లోపు గృహాలకు స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తారు. 10 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే గృహాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారానే భవన నిర్మాణానికి అనుమతి లభిస్తుంది. 600 గజాలపైన, 10 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తారు. ఉల్లంఘనలకు పాల్పడితే అనుమతులు ఇచ్చినంత సులువుగానే కఠిన చర్యలు ఉంటాని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
అద్భుతమైన సంస్కరణ
ప్రపంచవ్యాప్తంగా నగరీకరణ వేగంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో 58 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటుంది. పట్టణాల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పించ వచ్చు. ధరణి పోర్టల్ ఓ సాహసోపేతమైన నిర్ణయం. అదే తరహాలో టీఎస్-బీపాస్ ద్వారా అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చాం. ఇప్పటికే నూతన మున్సిపల్, పంచాయతీరాజ్, రెవెన్యూ చట్టాలు తీసుకొచ్చాం.