తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగ నియామకాలు, పదోన్నతులన్నింటికీ కొత్త జిల్లాలే ప్రాతిపదిక

అన్ని రకాల ఉద్యోగ నియామకాలు సహా పదోన్నతులు అన్నింటికీ కొత్త జిల్లాలనే పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త జోనల్ విధానానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఇక నుంచి అన్ని శాఖలు నియామకాలు సహా పదోన్నతులు చేపట్టాలని ఆదేశించింది. ఇటీవల కొన్ని శాఖలు పాత జిల్లాల ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేసిన తరుణంలో సాధారణ పరిపాలనాశాఖ అన్ని శాఖలకు మరోమారు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది.

ఉద్యోగ నియామకాలు, పదోన్నతులన్నింటికీ కొత్త జిల్లాలే ప్రాతిపదిక
ఉద్యోగ నియామకాలు, పదోన్నతులన్నింటికీ కొత్త జిల్లాలే ప్రాతిపదిక

By

Published : Jul 24, 2021, 5:06 AM IST

రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 33కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు ఆమోదం పొందింది. గతంలోనే కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. 2018 ఎన్నికల తర్వాత ములుగు, నారాయణపేట జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయడం... వికారాబాద్ జిల్లాను జోగులాంబ నుంచి చార్మినార్ జోన్​కు మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంతో దానికి మార్పులు, చేర్పులు అవసరమయ్యాయి. న్యాయపరమైన చిక్కులు సహా ఇతర అంశాల నేపథ్యంలో కొన్ని నియామకాలు, పదోన్నతులకు ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలనే ప్రాతిపదికగా తీసుకుంటూ వచ్చారు. పాత జిల్లాల ప్రాతిపదికనే ఆయా శాఖలు ప్రక్రియను కొనసాగించాయి. జోనల్ విధానంలో రెండు కొత్త జిల్లాలను చేర్చడంతో పాటు వికారాబాద్ జిల్లా బదలాయింపునకు కేంద్రం ఇటీవలే ఆమోద ముద్ర వేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30న నోటిఫికేషన్ వెలువరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం అసంతృప్తి..

రాష్ట్రంలో ప్రస్తుతం మొదటి దశలో భాగంగా యాభై వేల ఉద్యోగ నియామకాల కసరత్తు జరుగుతోంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా పోస్టుల వర్గీకరణ, పదోన్నతులు పూర్తి చేసి ఖాళీలను గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖలను ఆదేశించారు. సీఎం సమీక్ష సందర్భంగా కొన్ని శాఖలు మాత్రం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగానే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో పాఠశాల విద్యాశాఖ సహా మరికొన్ని శాఖలు ఉన్నట్లు తెలిసింది. ఈ పరిణామంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాక.. తిరిగి ఉమ్మడి జిల్లాలపరంగా నియామకాలు చేపట్టడం ఏమిటని సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది. ఇక నుంచి రాష్ట్రంలో నియామకాలు, పదోన్నతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త జోనల్ విధానానికి అనుగుణంగానే జరగాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

కొత్త జిల్లాల వారీగానే నిధులు..

33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీజోన్ల విధానానికి లోబడే అన్ని శాఖల్లో నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ జరగాలని సీఎం ఆదేశించారు. ఈ విషయమై అన్ని శాఖలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఉన్నతాధికారులకు కేసీఆర్​ స్పష్టం చేశారు. తద్వారా స్థానికులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు. డిస్ట్రిక్​ మినరల్​ డెవలప్​మెంట్​ ఫండ్ నిధులను ఇక నుంచి ఉమ్మడి జిల్లాలకు కాకుండా కొత్త జిల్లాల వారీగానే మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మెమో జారీ..

రాష్ట్రంలో జిల్లాలు అంటే ఇక నుంచి 33 జిల్లాలుగా మాత్రమే పరిగణించాలని, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో కొత్త జోనల్ విధానానికి సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నియామకాలు, పదోన్నతులు సహా అన్నింటికీ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్​మెంట్ ఆర్డర్ 2018నే విధిగా అనుసరించాలని స్పష్టం చేసింది. అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లాల కలెక్టర్లు దీనిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ మెమో జారీ చేశారు.

ఇదీ చూడండి: Telangana projects inflow: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కొనసాగుతోన్న వరద ఉద్ధృతి

ABOUT THE AUTHOR

...view details