రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్రకుమార్ జోషి 2018 ఫిబ్రవరి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. 1960లో జన్మించిన జోషి.. ఈ నెలాఖరున పదవీవిరమణ చేయనున్నారు. దాదాపు రెండేళ్లు సీఎస్‌గా ఉన్న ఆయనకు కొనసాగింపు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఈ విషయమై ఆయన కూడా ఆసక్తిగా లేరు. జోషీ స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులను సీఎస్‌గా నియమిస్తారు. ప్రస్తుతం ఆ హోదాలో పలువులు అధికారులు ఉన్నారు.
1983 బ్యాచ్‌కు చెందిన బీపీఆచార్య, బినయ్ కుమార్, 1984 బ్యాచ్‌కు చెందిన అజయ్ మిశ్రా ఈ జాబితాలో ఉన్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన పుష్పా సుబ్రమణ్యం, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, 1986 బ్యాచ్‌కు చెందిన రాజేశ్వర్ తివారీ కూడా సీనియర్ అధికారులే. 1987 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988 బ్యాచ్‌కు చెందిన అదర్ సిన్హా, రాణికుమిదిని, శాలినీమిశ్రా జాబితాలో ఉన్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి, సోమేశ్ కుమార్ కూడా ప్రత్యేక సీఎస్ హోదాలో ఉన్నారు. వీరిలో ఎవరినైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది.
వీరిలో బినయ్ కుమార్, పుష్పాసుబ్రమణ్యం, హీరాలాల్ సమారియా, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, రాణికుమిదిని కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక మిగిలిన అధికారులు అజయ్ మిశ్రా, చిత్రారామచంద్రన్, రాజేశ్వర్ తివారీ, అదర్ సిన్హా, సోమేశ్ కుమార్, శాంతికుమారి సీఎస్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశం ఉంది.