మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యామండలి కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఉద్యోగాలకు ఉన్నత విద్య ఉపయోగపడటం లేదని కొన్నేళ్లుగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అసంతృప్తి నెలకొంది. మరోవైపు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం కాలేజీల నుంచి బయటకు వస్తున్న విద్యార్థుల్లో ఉండటం లేదన్న భావన పారిశ్రామిక వర్గాల్లో ఏర్పడింది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉన్నత, సాంకేతిక విద్యలో మార్పులు అవసరమని కొంతకాలంగా విద్యా వేత్తలు, పారిశ్రామిక నిపుణులు నొక్కి చెప్తున్నారు. కొత్త కోర్సుల వైపు ఈ ఏడాది అడుగులు పడ్డాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌లో ఎక్కువగా కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
సంప్రదాయ కోర్సులకు స్వస్తి
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది ఆరు కొత్త విభాగాల్లో సుమారు 18వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఐటీ రంగంలో ఎక్కువ డిమాండ్ ఉన్న కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి కోర్సులకు ఏఐసీటీఈ అనుమతిచ్చింది. బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సులు ప్రవేశ పెట్టేందుకు ఎక్కువ కళాశాలలు మొగ్గు చూపాయి. కాలేజీలు అంచనా వేసినట్లుగా ఆ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి మంచి స్పందన కనిపించింది. మరోవైపు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ కోర్సుల్లో కొన్నేళ్లుగా అధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. సంప్రదాయ కోర్సుల్లోని సుమారు 13 వేల సీట్లను కళాశాలలు ఈ ఏడాది ఉపసంహరించుకున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చిన ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ నూతన కోర్సులకే ఎక్కువ డిమాండ్ నెలకొంది.
ప్రైవేటు ఐనా పర్వాలేదు
మహీంద్ర, మల్లారెడ్డి, అనురాగ్, ఎస్ఆర్, ఓక్సిన్ ప్రైవేట్ యూనివర్సిటీలూ ఈ ఏడాది బీటెక్‌లో కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ వంటి కోర్సులను ప్రారంభించాయి. ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ ఈ కొత్త కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువగా చేరారు. ఈ ఏడాది ఐఐటీలూ కొత్త కోర్సుల బాటపట్టాయి. ఐఐటీ హైదరాబాద్‌లో బయోమెడికల్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్, ఎంటెక్‌లో ఈ-వేస్ట్ రీసోర్స్ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.