తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న కరోనా - తెలంగాణలో కరోనా తాజా వార్తలు

రాష్ట్రంలో కరోనా వైరస్ కలవరపెడుతోంది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుల అనంతరం కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మే 6న ఇచ్చిన సడలింపుల తర్వాత వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. కొన్ని రోజులుగా జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

new corona positive cases increasing
జిల్లాల్లోనూ పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Jun 6, 2020, 6:59 AM IST

జిల్లాల్లోనూ పెరుగుతున్న కరోనా కేసులు

మహమ్మారి కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది... నగరాలు.. పట్టణాలు.. గ్రామాలు.. గూడెములు అన్న తేడా లేకుండా గల్లీ గల్లీలో పాగా వేస్తోంది. లాక్​డౌన్​ నిబంధనలు సడలింపుతో కేసులు సంఖ్య అటు రాజధానితో పాటు జిల్లాల్లోను పెరిగిపోతున్నాయి.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 70 శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనివే. ఇదే సమయంలో వైరస్ మళ్లీ జిల్లాలను చుట్టేస్తోంది. రెండో విడత లాక్‌డౌన్‌లో కఠినా నిబంధనలు అమలు చేయడంతో హైదరాబాద్‌, పరిసర జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. వరంగల్ గ్రామీణం, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాలో అప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మే 1 నుంచి 14 వరకూ ఒక్క కేసు నమోదు కాని జిల్లాల జాబితాలో మరో 26 చేరాయి. దీంతో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నాడు కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమైంది. మూడో విడత లాక్‌డౌన్‌లో సడలింపులిచ్చిన తర్వాత వైరస్ క్రమేణా విస్తరిస్తోంది. ఇప్పుడు వరంగల్ గ్రామీణ జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తిరిగి కొవిడ్ కేసులు నమోదవుతుండడం వ్యాప్తి తీవ్రతకు నిదర్శనం.

అలా మొదలైంది...

రాష్ట్రంలో మార్చి 2న తొలి కేసు నమోదైంది. అదే నెల 22 నుంచి లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. ఏప్రిల్ 7 వరకూ తొలివిడత.. ఏప్రిల్ 8 నుంచి మే 5 వరకూ మలివిడత కొనసాగింది. ఈ రెండు విడతల్లో దాదాపుగా నిబంధనలు కఠినంగా అమలయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. ఫలితం కూడా కనిపించింది. తొలివిడత లాక్‌డౌన్ విధించిన 16 రోజుల్లో 396 కేసులు నమోదు కాగా... రెండో విడతలో 418 మందిలో కరోనా గుర్తించారు. ఈ కేసుల్లో అత్యధికం మర్కజ్‌తో ముడిపడినవే. వైరస్‌ వ్యాప్తి కట్టడి అవుతున్న సమయంలో మే 6 నుంచి ఆంక్షల ఎత్తివేత క్రమేణా మొదలైంది. అప్పటి నుంచి జనం రోడ్ల మీదకు రావడం ప్రారంభించారు. నిబంధన ఉల్లంఘనలు జరిగాయి.

ఏమరపాటు తగదు...

జీహెచ్​ఎంసీతో పోల్చితే జిల్లాల్లో కేసుల నమోదు తక్కువే. అయితే ఏమరుపాటుగా ఉంటే.. గ్రామీణంలోనూ వైరస్ వ్యాప్తి వేగంగా జరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపును దుర్వినియోగం చేయొద్దని అంటున్నారు. భౌతిక దూరం పాటించాలని, ముఖానికి తప్పనిసరిగా మాస్కు ధరించాలని చెబుతున్నారు.

ఇవీ చూడండి: నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం.!

ABOUT THE AUTHOR

...view details