New Committees In Telangana Congress: పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పలుమార్లు కొత్త కమిటీల ఏర్పాటుపై చర్చ జరిగినా కార్యరూపం దాల్చలేదు. ఏఐసీసీ అధ్యక్షుడుగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నికవడంతో నూతన కమిటీ ఏర్పాటుపై పీసీసీ కసరత్తు చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నూతన కమిటీ ప్రకటించిన ఏఐసీసీ ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది. మూడు రోజులుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి ఈ విషయంపై కసరత్తు చేశారు.
గురువారం పార్టీలో సమస్యలు, సమన్వయంపై చర్చించిన నేతలు.. శుక్రవారం నూతన కార్యకవర్గం ఏర్పాటుపై దృష్టిసారించారు. అన్ని వర్గాల వారికి సమప్రాధాన్యం కల్పిస్తూ 2023ఎన్నికలే లక్ష్యంగా ఈ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వారంలోనే పీసీసీ నూతన కార్యవర్గంతో పాటు డీసీసీ అధ్యక్షుల నియామక ప్రకటన వెలువడనుంది. పదవులు భర్తీ చేస్తే క్షేత్రస్థాయి నుంచి బలోపేతానికి అవకాశం ఉంటుందన్న రేవంత్‌రెడ్డి అధిష్ఠానానికి తెలపడంతో ఆ ప్రక్రియను ప్రారంభించారు.
ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం:ఎన్నికల సంవత్సరం కావడంతో రేవంత్‌రెడ్డి కోరిక మేరకు ఎక్కువ భాగం కమిటీ కూర్పు జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త కమిటీలలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం 50 ఏళ్ల లోపు వారికి సగం పదవులు ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది. అదే జరిగితే చాలా మంది సీనియర్లకు స్థానం దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రంలోని సగం డీసీసీలు మారే అవకాశం ఉందని సమాచారం.