3000 New Charging Stations in Telangana : ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరగాలంటే.. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలు(Electric Charging Centers) విరివిగా అందుబాటులోకి రావాలి. అలాంటప్పుడే వాహనదారులు ఈవీ వాహనాల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా హైవేలపై ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే కార్ల కొనుగోలు ఊపందుకుంటుంది. సరిగ్గా ఈ దిశగానే తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) చర్యలు చేపడుతోంది.
దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని టీఎస్రెడ్కో(TS REDCO) చైర్మన్ సతీష్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే యాదాద్రిలో పీపీపీ విధానంలో.. దేశంలోనే మొదటి ఛార్జింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇది చాలా విజయవంతంగా నడుస్తోందన్నారు.
30 నిమిషాల్లో కారుకు ఫుల్ ఛార్జింగ్.. త్వరలోనే నగరంలో అందుబాటులోకి కేంద్రాలు
EV Charging Stations in Telangana : ఇప్పుడు రాష్ట్రంలోని జిల్లాలలో, హైవేలపై మొత్తం 615 ప్రాంతాల్లో టీఎస్రెడ్కో చూపించిన స్థలాల్లో ప్రైవేటు సంస్థలు ఫాస్ట్, స్లో ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు, విధివిధానాల కోసం హైదరాబాద్‌లోని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ కేంద్ర కార్యాలయంలో కానీ, జిల్లాలోని సంస్థ కార్యాలయాల్లో గానీ, https://tsredco.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను కానీ సందర్శించాలని రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి సూచించారు.
తెలంగాణ రాష్ట్ర పునరుత్పదక శక్తి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో.. ఇప్పటికే హైదరాబాద్‌లో 405 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఎస్రెడ్కో సంస్థ స్వయంగా 150 వరకు ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇందులో 90 కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయని రెడ్కో స్పష్టం చేసింది. మరికొన్ని కేంద్రాలకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి.
సోలార్ విద్యుత్‌తో రాష్ట్రంతా వెలుగులమయం, టీఎస్ రెడ్కోతో మరిన్ని ప్రాజెక్టులు
EV Charging Stations in Hyderabad :గ్రేటర్ హైదరాబాద్(GHMC) తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ మారుమూల ప్రాంతాల్లోనూ.. ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు రెడ్కో వెల్లడించింది. రాష్ట్రంలో ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలు వాడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన ప్రతీ ఒక్కరికి ఛార్జింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్రమంతటా ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో రెడ్కో సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు.
2025 నాటికి 3,000 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా రెడ్కో సంస్థ ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. అందుకోసం రెడ్కో సంస్థ స్వయంగా ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 615 కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యాక మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ప్రజలు రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు చేస్తోంది.
TS REDCO EV Charging Stations: ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెంచేందుకు రెడ్కో కసరత్తు