తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్‌ భవనాలకు త్వరలో మోక్షం.. తుదిదశకు నిర్మాణాలు - కలెక్టరేట్​ భవనాలకు నిధులు మంజూరు

జిల్లా కలెక్టరేట్ల నూతన భవనాలకు త్వరలో మోక్షం లభించనుంది. 12 జిల్లాల్లో నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. మే నెలలో ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిధుల లేమితో మూడున్నరేళ్లుగా నత్తనడకన సాగుతున్న పనుల్లో ఇటీవల కదలిక వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించటంతో గుత్తేదారులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా మరో మూడు జిల్లాల్లో సైతం కలెక్టరేట్ల నిర్మాణాలకు సర్కారు పచ్చజెండా ఊపింది.

new-buildings-of-the-district-collectorates-will-soon-have-salvation
కలెక్టరేట్‌ భవనాలకు త్వరలో మోక్షం!

By

Published : Mar 29, 2021, 7:01 AM IST

రాష్ట్రంలోని 24 జిల్లాల్లో నూతన కలెక్టరేట్లు నిర్మించాలని 2018లో ప్రభుత్వం నిర్ణయించింది. నిధులను వేగంగా విడుదల చేయకపోవటంతో చాలాచోట్ల పనులు కొలిక్కి రాలేదు. బిల్లుల కోసం గుత్తేదారులు మొన్నటివరకు రహదారులు, భవనాల శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే సిద్దిపేట, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్‌ పట్టణ, జనగాం, మేడ్చల్‌, వికారాబాద్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గుత్తేదారుల వెంటపడి పనులు చేయించడంతో దాదాపు పూర్తయ్యాయి.

పచ్చదనం, ఫర్నిచర్‌ను సిద్ధం చేసే పనులు ఆయాచోట్ల ముమ్మరంగా సాగుతున్నాయి. మే నెలలో ఈ జిల్లాల్లో భవన సముదాయాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఒకట్రెండు జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారులు చెబుతున్నారు.

  • కరీంనగర్‌, ములుగు, నారాయణపేట జిల్లాల్లో కూడా కలెక్టరేట్‌ కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం ఇటీవల అనుమతి మంజూరు చేసింది. కరీంనగర్‌ జిల్లాలో కలెక్టరేట్‌ భవనం 25-30 సంవత్సరాల మధ్య నిర్మించింది కావటంతో నూతన నిర్మాణానికి ప్రభుత్వం తొలుత అనుమతించలేదు. ఆ జిల్లా నేతలు పట్టుపట్టడంతో తాజాగా మంజూరు చేసింది.
  • కుమురంభీం ఆసిఫాబాద్‌, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో పనులు 70 నుంచి 80 శాతం పూర్తయ్యాయి. ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
  • మెదక్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో పనులు 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మహబూబాబాద్‌ భవన నిర్మాణం కోసం నిర్మించిన సెంట్రింగ్‌ ఇటీవల కూలిపోవటంతో కూలీలు గాయపడ్డారు. అధికారులు ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

జయశంకర్‌ భూపాలపల్లిలో భవన సముదాయాన్ని ఎక్కడ నిర్మించాలన్న అంశం రెండున్నరేళ్లుగా నలుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యంతో ఇటీవలే సమస్య కొలిక్కి వచ్చింది. నిధులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాల్లో నిర్మాణాలు పూర్తి చేసేందుకు వీలుగా అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

ఇదీ చూడండి:మూడు రోజుల పాటు సహజ సేంద్రియ ఉత్పత్తుల మేళా

ABOUT THE AUTHOR

...view details