తెలంగాణలో కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు 100 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.
సొంత భవనాలు లేని గ్రామాలకు
భవన నిర్మాణాల ప్రతిపాదనల తయారీలో కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భూమి లభ్యత ఉండి, సొంత భవనాలు లేని గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మూడో దశ ప్రతిపాదనల రూపకల్పనపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఇంజనీర్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలలో కనీసం 20 శాతం జీపీలకు మొదటి దశలో భవనాలు నిర్మించేలా ప్రతిపాదనలు ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.