రాష్ట్ర రాజధానిలోని పేదలకు మరిన్ని వైద్య సౌకర్యాలు కల్పించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన బస్తీ దవాఖానాలను... తర్వాత కాలంలో పెద్ద ఎత్తున విస్తరించడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 199 బస్తీ దవాఖానాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దవాఖానాలో ప్రభుత్వం నాణ్యమైన సేవలు అందించడంతో రోగులు పెద్ద ఎత్తున వస్తున్నారు. పేదలుండే పలు బస్తీల్లో ఏర్పాటు చేసిన దవాఖానాల ద్వారా త్వరితగతిన వైద్య సేవలు అందుతున్నాయి. చెంతకే వైద్య సేవలు రావడంతో అనారోగ్యంతో ఉన్నవారు వెళ్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. బస్తీ దవాఖానలో ప్రస్తుతం ఒక్కోదానికి కనీసం 100 మంది వరకు ఇన్ పేషెంట్‌ల సంఖ్య ఉందని పేర్కొన్నారు. 199 దవాఖానాల ద్వారా ప్రతి రోజూ సరాసరి 25 వేల మందికి సేవలు అందుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వెంటనే కొత్తగా మరో 30 బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని వైద్య, ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. వీటితోపాటు వారం రోజుల్లో మరో 37 కొత్త బస్తీ దవాఖానాలు తెరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
300 బస్తీ దవాఖానాల ఏర్పాటే లక్ష్యంగా సర్కారు చర్యలు
హైదరాబాద్ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పుడున్న 199 బస్తీ దవాఖానాలకు తోడు... వెంటనే మరో 30 బస్తీ దవాఖానాలను ప్రారంభించాలని ఆదేశించింది. వీటితో పాటు ఇంకో వారం రోజుల్లో మరో 37 కొత్త బస్తీ దవాఖానాలను తెరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. జీహెచ్ఎంసీలో వార్డుకు 2 బస్తీ దవాఖానాల చొప్పున మొత్తం 300 ఆస్పత్రుల ఏర్పాటే లక్ష్యమని పేర్కొంది.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని బస్తీ దవాఖానాలన్నీ ఇప్పటికే ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. మిగిలిన వాటిని ఆన్‌లైన్ చేసి ఎప్పటికప్పుడు వాటి ద్వారా అందుతున్న వైద్యసేవలు పరిశీలించనున్నారు. బస్తీ దవాఖానాలు విజయవంతమైన దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో రెండు పడక గదుల ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించింది. బస్తీ దవాఖానాలు, అర్బన్ పీహెచ్సీల్లో కేవలం ఓపీ సేవలు మాత్రమే కాకుండా వైద్య పరీక్షలూ అందిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 5 వేల టెస్టులు చేస్తున్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది. ఈ వైద్య పరీక్షలు తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా చేస్తుండగా... పరీక్షల ఫలితాలు మొబైల్ ఫోన్ ఉన్నవారికి వెంటనే చేరేలా సేవలు అందిస్తున్నారు.
ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయండి: కమిషనర్