రాష్డ్రంలో అటవీ బీట్ అధికారుల(ఎఫ్‌బీవో) పోస్టుల భర్తీలో కొత్త అధ్యాయం నెలకొంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఖాళీగా మిగిలిపోయిన 324 పోస్టులకు తదుపరి ఎంపిక పరీక్షలు నిర్వహించేందుకు త్వరలో జాబితాను ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదేని ఒక ఉద్యోగ ప్రకటనకు తుది జాబితా వెల్లడించిన తరువాత, అందులో ఖాళీగా మిగిలిపోయిన పోస్టులను బ్యాక్‌లాగ్ కిందకు చేర్చాలి. తదుపరి మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకూడదని స్పష్టంగా పేర్కొంది.
అటవీశాఖలో 1313 ఎఫ్‌బీవో పోస్టులు ఖాళీలు ఉండగా, టీఎస్‌పీఎస్సీ నియామక ప్రక్రియ ద్వారా 1282 పోస్టుల భర్తీ చేపట్టింది. అటవీ డివిజన్లలో 875 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల్లో చేరారు. 83 మంది అభ్యర్థులు రిపోర్టు చేసి వెంటనే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. మరో 174 మంది ఉద్యోగాల్లో చేరలేదు.