నివర్ తుపాను ప్రభావంతో 3రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు రాయలసీమ జిల్లాలను ముంచెత్తాయి. చిత్తూరు, కడప జిల్లాలను గడగడలాడించాయి. కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు వందల పూరిగుడిసెలను నేలమట్టం చేశాయి. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు ఏకమయ్యాయి. వరదనీరు పరుగులెత్తిన వాగులు, వంకల్లో పడి 8మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అరుగురు, కడప జిల్లాలో ఇద్దరు నివర్ తుపాను తాకిడికి మృతి చెందారు. నీటి చుక్క ఎరుగని జలాశయాలు సైతం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. గేట్లు దూకి వరద ఉద్ధృతంగా ప్రవహించింది. వరద ధాటికి సాగునీటి ప్రాజెక్ట్‌ల గట్లు తెగి వేల క్యూసెక్‌ల నీరు సముద్రం పాలైంది.
చిగురుటాకులా చిత్తూరు
నివర్ ధాటికి చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణికింది. జిల్లాలోని తూర్పు ప్రాంతమైన నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వేల ఎకరాల పంట నీట మునిగింది. 12 మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. జిల్లాలోని గార్గేయ, నీవా, స్వర్ణముఖి, అరుణా, పింఛా నదులు పొంగిపొర్లాయి. ఆయా నదులపై నిర్మించిన జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరాయి. వరదనీరు నిర్వహణలో భాగంగా జలాశయాల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదలడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో అరుణానదిపై నిర్మించిన అరణియార్ జలాశయం గేట్లు ఎత్తి వేల క్యూసెక్‌ల నీరు కిందకు వదిలారు.
పంటలు జలమయం
తుపాను వల్ల కురిసిన భారీ వానలకు శ్రీకాళహస్తి-పిచ్చాటూరు మధ్య 2రోజుల పాటు రాక పోకలు స్తంభించాయి. కాళంగి, మల్లెమడుగు జలాశయాల నుంచి వచ్చిన నీరు.. వేల ఎకరాల పంటను ముంచింది. రేణిగుంట సమీపంలో మల్లెమడుగు జలాశయం నుంచి వచ్చిన నీటిలో చిక్కుకొని ఓ రైతు ప్రాణాలు కోల్పోయారు. గార్గేయనదిలో పడి ఇద్దరు విగతజీవులయ్యారు. జిల్లా వ్యాప్తంగా 523 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 32 కల్వర్టులు కోతకు గురయ్యాయి. వందల సంఖ్యలో గొర్రెలు, మేకలు చనిపోయాయి. చిత్తూరు జిల్లాలో ప్రాథమికంగా 24 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనావేశారు. అత్యధికంగా 19వేల ఎకరాల వరిపంట నీటమునిగింది. వేరుశనగ, టమోటాతో పాటు అపరాల పంటలు నేలపాలవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కడపపై నివర్
నివర్ తుపాను కడప జిల్లాపైన తీవ్ర ప్రభావం చూపింది. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. సుండుపల్లె వద్ద నున్న పింఛా జలాశయానికి వరద పోటెత్తడంతో కుడిగట్టు 50 మీటర్ల మేర తెగిపోయింది. వరద నీరు అన్నమయ్య ప్రాజెక్ట్‌లోకి చేరింది. లక్షా ఇరవై వేల క్యూసెక్‌ల ప్రవాహం ఒక్కసారిగా అన్నమయ్య ప్రాజెక్ట్‌లోకి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు.
స్తంభించిన రాకపోకలు
సి.కె.దిన్నె బుగ్గవంక జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో... నీటిని కిందకు వదలడంతో కడప నగరాన్ని వరద ముంచెత్తింది. నాగరాజుపేట, రవీంద్రనగర్, బాలాజీ నగర్, నబీకోట, గుర్రాలగడ్డ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రైల్వేకోడూరు వద్ద గుంజనేరు వాగు పొంగిపొర్లింది. తిరుపతి-కడప మధ్య రాకపోకలు స్తంభించాయి. రాయచోటి, బద్వేలు, కడప నియోజకవర్గాల్లో పలు చెరువులకు గండ్లుపడ్డాయి. రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అరటి, బొప్పాయి పంటలు సాగుచేసిన రైతులు నిండా మునిగారు. రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల్లో వరి పంట నేలపాలైంది.