తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ-పాసుల తిరస్కరణపై ట్విట్టర్​లో డీజీపీకి ఫిర్యాదు

లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల వారికి పోలీసు శాఖ ఈ-పాస్‌లు జారీ చేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్​ను ఏర్పాటు చేసింది. మొదట సర్వర్​ మోరాయిస్తోందనే మాటలు వినపడగా.. ప్రస్తుతం అత్యవసరం ఉన్న వాళ్ల దరఖాస్తులను తిరస్కరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు బాధితులు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉన్నతాధికారని ట్యాగ్​ చేసి.. తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

complaints on epass allotment
ఈ-పాసులపై ఫిర్యాదు

By

Published : May 24, 2021, 10:50 PM IST

పోలీసు శాఖ జారీ చేస్తోన్న ఈ-పాసులు తమకు అందడం లేదంటూ.. పలువురు నెటిజన్లు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నారు. అత్యవసరం ఉన్న వాళ్ల దరఖాస్తులను కూడా తిరస్కరిస్తున్నారని.. ట్విట్టర్ ద్వారా మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు. వరుస ఫిర్యాదులపై స్పందించిన ఉన్నతాధికారి.. సమస్యను పరిష్కరించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

ఈ- పాస్​పై విమర్శలు

కరోనాతో ఆస్పత్రి పాలైన మనవరాలిని చూసేందుకు ఈ-పాసులో దరఖాస్తు చేస్తే.. పోలీసులు తిరస్కరించారని ఓ వైద్యుడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోన్న తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి రెండు రోజుల క్రితం దరఖాస్తు చేసినా.. ఎలాంటి పురోగతి లేదని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. జగిత్యాలకు చెందిన తలసేమియా వ్యాధిగ్రస్థుడు.. హైదరాబాద్ రావడానికి తాను చేసుకున్న దరఖాస్తును తిరస్కరించారని వాపోయాడు.

మరింత కఠినం

రాష్ట్రంలో పోలీసులు లాక్​డౌన్ నిబంధనలను మరింత కఠినం చేశారు. మినహాయింపు సమయం తప్పితే మిగతా వేళల్లో బయటికి వచ్చే వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. సరైన కారణం, ధ్రువపత్రాలు లేకుండా తిరిగే వాహనాలను సీజ్ చేస్తున్నారు. దీంతో చాలా మంది ఈ-పాసులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ అనుమతి ఇవ్వడం లేదు. పరిశీలనలో పలు దరఖాస్తులను తిరస్కరిస్తుండటం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతోన్న లాక్‌డౌన్​

ABOUT THE AUTHOR

...view details