Secunderabad Theft Case update :సికింద్రాబాద్‌లోని సింధు కాలనీలో జరిగిన చోరీలో రాంగోపాల్ పేట్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రాహుల్ అనే వ్యాపారి ఇంట్లో ఐదేళ్ల క్రితం కాపలాదారుగా చేరిన కమల్ ఈ చోరికి పాల్పడినట్లు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. కమల్.. తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి... వ్యాపారి రాహుల్ ఇంట్లోనే ఓ గదిలో ఉంటూ కాపలాదారుగా పనిచేస్తున్నాడు. రాత్రింబవళ్లు ఇంటికి కాపలా కాస్తూ యజమాని నమ్మకం చూరగొన్నాడు.
Nepali Thieves in Hyderabad : అవకాశం కోసం ఎదురు చూసిన కమల్... ఓ రోజు రాత్రి రాహుల్ కుటుంబమంతా బయటికి వెళ్లడంతో... స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. నిందితులు ఇప్పటికే దేశ సరిహద్దు దాటి నేపాల్‌లోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబయిలోని మధుర బస్ స్టేషన్‌లో ముగ్గురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ వాళ్ల దగ్గర పెద్దగా బంగారం లభించలేదు. చోరీకి పాల్పడ్డ నిందితులు వాటాలు పంచుకొని ఎవరికి వారు... వేర్వేరుగా నేపాల్‌కు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు కమల్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులను పట్టుకుంటే చోరీకి గురైన బంగారం ఎక్కువ మొత్తంలో లభించే అవకాశం ఉంది.
Nepali gang Arrested in Secunderabad theft case : ఈ తరహా చోరీల క్రమాన్ని పరిశీలిస్తే... నేపాల్‌లో కొంత మంది ముఠాగా ఏర్పడి భారత్‌కు వస్తున్నారు. హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, ముంబయి వంటి మహానగరాల్లో తిష్ట వేస్తున్నారు. ముఠాలోని కొందరు సభ్యులు ఏజెన్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంట్లో పనివాళ్లను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలిస్తున్నారు. సంప్రదించే యజమానులకు నమ్మకం కలిగేలా... పనివాళ్లను సమకూరుస్తున్నారు. పనివాళ్లు ఎంతో కష్టపడి పనిచేస్తూ యజమాని నమ్మకం పొందుతున్నారు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలోనో... లేదా ఆహారంలో మత్తుపదార్థాలు కలిపో... దొంగతనాలకు పాల్పడుతున్నారు. చోరీ చేసే సమయంలో ఇంట్లో ఉండే పనివాళ్లకు... ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ముఠాలోని ఇతర సభ్యులు సహకరిస్తారు. పోలీసులకు చిక్కకుండా.. దోచుకున్న సొత్తుతో పరారయ్యేలా ముందే అన్నీ సిద్ధం చేసుకుంటారు. చోరీ చేసిన తర్వాత రైళ్లలో ఉత్తరప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్ చేరుకొని అక్కడి నుంచి సరిహద్దుల మీదుగా నేపాల్ చేరుకుంటారు.