నమ్మకంగా పనిచేసి యజమానులకు మత్తుమందు ఇచ్చి చోరీకి పాల్పడటం....పోలీసులకు దొరకకుండా తలో దారిలో నేపాల్ సరిహద్దు దాటడం... ఇలాంటి కేసులు భాగ్యనగరంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఈనెల 5న రాయదుర్గం ఠాణా పరిధిలోని బీఎన్ రెడ్డి హిల్స్‌లో మధుసూధన్ అనే వ్యాపారి ఇంట్లో పని చేసే నలుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న వారికి ఆహారంలో మత్తుమందు కలిపి రూ. 23లక్షల నగదు, 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. తాజాగా నాచారంలో ఇలాంటి చోరీనే జరిగింది.
నేపాల్ పనివాళ్లను కోరిమరీ పనిలో పెట్టుకున్న ప్రదీప్ కుమార్‌కు టోకరా వేశారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన సమయంలో వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి 18 తులాల బంగారు ఆభరణాలు, రూ. 10 లక్షల నగదు, 40 తులాల వెండి కాజేసి ఉడాయించారు. ఫిబ్రవరిలో నార్సింగి పోలీస్టేషన్ పరిధిలో వృద్ధ దంపతుల ఇంట్లో పని చేసిన నేపాల్ వ్యక్తులు అదును చూసి వారిని తాళ్లతో కట్టేసి దోచుకెళ్ళారు. మూడు నెలల క్రితం సైనిక్‌పురిలోని వ్యాపారి నర్సింహారెడ్డి ఇంట్లో యజమానులు శుభకార్యానికి వెళ్లగా ఇల్లు గుల్ల చేసి పారిపోయారు. నిందితుల కోసం ఇప్పటికీ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.
పక్కా ప్రణాళికతో...
ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న నేపాలీలు.... ఈ తరహాలో చోరీలకు ఎందుకు పాల్పడుతున్నారనే విషయంపై పోలీసులు విశ్లేషణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఎక్కువగా నేపాల్‌లోని అచ్చామ్, బార్ధియా, చిట్వాన్, కైలాలి జిల్లాల వారు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గమనించారు. వారి నేర ప్రక్రియపై పలు కీలక అంశాలు గుర్తించారు. దేశంలోని మెట్రో నగరాల్లో ఉన్న సెక్యురిటీ ఏజెన్సీ, మెయిడ్ సర్వెంట్ ప్రతినిధులతో నేపాల్‌లోని ప్రధాన నేరస్థులకు సంబంధాలు ఉంటాయి. యజమానులు పనివాళ్ల కోసం అడగగానే ఈ విషయాన్ని నేపాల్‌లోని ఏజెంట్లకు చెబుతారు. అక్కడి నుంచి వారు కొంత మందిని పనిలోకి పంపిస్తారు. భార్యా భర్తలుగా చిత్రీకరించి జంటను పనిలో చేర్పిస్తారు. పనిలో చేరిన వారితో తరచూ సంప్రదింపులు జరుపుతారు. ఇంట్లోని పరిస్థితులు పూర్తిగా గమనించిన తర్వాత ప్రధాన నిందితునికి సమాచారం ఇస్తారు. నేపాల్ నుంచి ఓ ముఠా బయలు దేరుతుంది. వీరికి సహాయంగా నగరంలోని మరికొంత మందిని కూడగడతారు. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో వీరికి తెలిసినవారు... నిద్రమాత్రలు అందిస్తారు. వాటిని పొడిగా చేసి ఇంట్లో వంట చేసే వారికి ఆ మత్తు పదార్థం అందిస్తారు. పక్కా ప్రణాళికతో చోరీ చేసి తర్వాత ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా తలోదారిన నేపాల్ పారిపోతారు.