నివర్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన వర్షాలకు సోమశిలలోకి ప్రవాహం పోటెత్తుతోంది. ఆ నీటినంతా అధికారులు గేట్లెత్తి పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నారు. ఫలితంగా వరద ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. నెల్లూరు నగరంలో పెన్నానదిని ఆనుకుని ఉన్న అనేక కాలనీలు ఇప్పుడు జలదిగ్బంధం అయ్యాయి. ఇందులో అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లతో పాటు అక్రమంగా కట్టుకున్న నివాసాలు కూడా ఉన్నాయి. ఇప్పుడవన్నీ చెదిరిపోయాయి. ప్రధానంగా జయలతా నగర్, వెంకటేశ్వరపురం, ఈద్గామిట్ట, రాజీవ్ గాంధీ కాలనీ మునిగిపోయాయి. ప్రవాహం ఉన్నట్టుండి చుట్టేయడంతో కట్టుబట్టలతో మిగిలామని ముంపు బాధితులు వాపోతున్నారు.
వరదలో రంగనాథుడు
సామాన్య ప్రజలకే కాదు దేవుడికీ వరద కష్టాలు తప్పలేదు. పెన్నానది ఒడ్డునున్నతల్పగిరి రంగనాథుడినీ వరద చుట్టుముట్టింది. ఆలయం వెనుక నుంచి ప్రాకారంలోకి నీళ్లు ప్రవేశించాయి. గర్భగుడిలోకి కూడా వెళ్లాయి. ఆలయంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలను జలవనరుల మంత్రి అనిల్ పరిశీలించారు. సాలుచింతల వద్ద కోతకు గురవుతున్న పొర్లుకట్టకు మరమ్మతులు చేయించాలని అధికారుల్ని ఆదేశించారు. ముంపు బాధితుల పునరావాస కేంద్రాలను తనిఖీ చేశారు. 4 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించామన్న మంత్రి.. వరద తగ్గిన వెంటనే సహాయక చర్యలు చేపడతామని చెప్పారు. పెన్నా వరదను తట్టుకునేలా నెల్లూరులో రింగ్‌బండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.