లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా పార్కులు, జంతు ప్రదర్శనశాలలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన నెహ్రు జూలాజికల్ పార్కు మళ్లీ ప్రారంభంకావటంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా.. థర్మల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం మాస్కులు ధరించిన వారినే అనుమతిస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.
ఉమ్మితే వెయ్యి రూపాయలు జరిమానా
లాక్‌డౌన్ కాలంలో పార్కును పరిశుభ్రంగా ఉంచామని అధికారులు చెప్పారు. జంతువులు ఉండేటువంటి ఎన్ క్లోజర్లను రోజుకు రెండుసార్లు శానిటైజేషన్ చేస్తున్నామని తెలిపారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పార్కులో ఉమ్మిన వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇరుకుగా ఉండటం వల్ల సరిసృపాలు, నిశాచర జంతుశాల, ఎక్వేరియం, ఫాజిల్ మ్యూజియం, హిస్టరీ మ్యూజియం మూసివేశామని అధికారులు వెల్లడించారు.