Private Debt Scheam: ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి తీసుకున్న రుణాల నుంచి రైతులకు విముక్తి కల్పించే పథకం రాష్ట్రంలో పది శాతం కూడా ఆచరణకు నోచుకోవట్లేదు. ప్రైవేటు అప్పులు తీర్చడానికి వీలుగా ఎలాంటి పూచీకత్తు లేకుండా అన్నదాతలకు డెబిట్ స్వాపింగ్ లోన్ ఇవ్వాలన్న రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు నిరాదరణకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల్లో 3 శాతం రూ. 17 వందల 70 కోట్ల రూపాయలు అప్పు మార్పిడి రుణం ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయించింది. అన్ని బ్యాంకులకు రుణ లక్ష్యాలను నిర్దేశించింది. ఐతే ఆర్థిక సంవత్సరం పూర్తయినా ఈ మొత్తంలో 10 శాతం కూడా ఇవ్వలేదని అధికార వర్గాలు అంచనాకు వచ్చాయి.
డీఎస్ఎల్లో కోటా కింద రుణాల పంపిణీ పెద్దగా జరగలేదని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి తెలిపింది. ఈ విధంగా అప్పులు ఇస్తారనే విషయంపై రైతులు, బ్యాంకుల సిబ్బందికి పెద్దగా అవగాహన లేకపోవడంతోనే పంపిణీ చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. రైతుకు బ్యాంకులో పంట రుణానికి సంబంధించి పాత బాకీ ఉన్నా సరే ప్రైవేటు అప్పులు తీర్చడానికి అదనంగా రుణాలివ్వాలని ఆర్బీఐ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డీఎస్ఎల్ కింద రుణం ఇవ్వడానికి తిరస్కరిస్తే స్థానిక లోక్‌అదాలత్‌లో ఫిర్యాదు చేయాలని హైకోర్టు సైతం తీర్పు ఇచ్చింది. అయితే ఎక్కువ మంది రైతులకు ఈ విషయం తెలియక బ్యాంకులపై ఫిర్యాదులేమీ చేయడం లేదు.