Neet Exam: నీట్ పరీక్షకు సర్వం సిద్దమైంది. దేశవ్యాప్తంగా 543 నగరాలు, పట్టణాలతోపాటు.. విదేశాల్లోనూ 13 నగరాల్లో పరీక్ష కేంద్రాలు సిద్దం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా అందులో రాష్ట్రం నుంచి దాదాపు 60వేల మంది ఉన్నారు. హైదరాబాద్ సహా 25 నగరాలు, పట్టణాల్లో 115 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు . ఈఏడాది పరీక్ష సమయాన్ని 20 నిమిషాలు పెంచారు.
రెండేళ్లుగా కరోనా వల్ల 20 ప్రశ్నలు అదనంగా ఇచ్చినా సమయాన్ని పెంచలేదు. ఈ ఏడాది సమయం పెంచినందున 200 నిమిషాల్లో 200 ప్రశ్నల్లో 180కి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు.. నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒకనిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ స్పష్టం చేసింది.
ఆంగ్లంతోపాటు తెలుగు, హిందీ వంటి 13 భాషల్లో పరీక్ష ఉంటుంది. నీట్ పరీక్షకు పలు నిబంధనలు, ఆంక్షలను ఎన్టీఏ ఇప్పటికే ప్రకటించింది. నిబంధనలు బేఖాతరు చేస్తే మూడేళ్ల వరకు డిబార్ చేయనున్నట్లు వెల్లడించింది. అడ్మిట్ కార్డుతోపాటు పాస్‌పోర్టు సైజ్‌ఫోటో, ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్‌కార్డు వంటి ఏదైనా గుర్తింపుపత్రం తీసుకెళ్లాలి. అభ్యర్థులు మాస్క్‌ధరించాలని స్పష్టంచేసింది. చిన్నశానిటైజర్ తీసుకెళ్లవచ్చు.