వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(Neet 2021) రాష్ట్రంలో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కేటాయించిన నగరాలు, పట్టణాల్లో పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమైన పరీక్ష కోసం... విద్యార్థులు నిర్దేశించిన సమయానికన్నా ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని జాతీయ పరీక్షల సంస్థ ముందే స్పష్టం చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతుంది. కరోనా పరిస్థితుల్లో మాస్కులు ఉన్న వారినే కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ఫొటో లేకుండా వచ్చిన విద్యార్థులకు... అక్కడే ఫొటో గ్రాఫర్‌ను ఏర్పాటు చేసి... ఫొటో తీసి లోపలికి అనుమతిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో లక్ష మందికి పైగా..
ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో తెలంగాణ నుంచి దాదాపు 55వేలు, ఏపీ నుంచి సుమారు 50వేల మంది ఉన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 202 నగరాలు, పట్టణాల్లో 3,842 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, హయత్ నగర్ పట్టణాల్లో 112... ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరి పట్టణాల్లో 151 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ వెల్లడించింది. ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ వంటి 13 భాషల్లో పరీక్ష ఉంటుంది.
హనుమకొండలో ప్రశాంతంగా..
నీట్ పరీక్ష హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ప్రారంభమైంది. నీట్ పరీక్షకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా... 5,189 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేయడం వల్ల గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.