తెలంగాణ

telangana

ETV Bharat / state

వేప చెట్లకు మళ్లీ తెగులు.. కోకొల్లలుగా శిలీంధ్రాలు వదిలిన బీజాలు

Neem Trees infected with Fungal Virus: వేపను ఆరోగ్య సంజీవనిగా భావిస్తారు. వ్యవసాయంలో చీడపీడలు, తెగుళ్లను సమర్థంగా అరికడుతుంది. బహుళ ప్రయోజనాల గనిగా అనాది నుంచి ఔషధాల తయారీలో వేపది పెద్దన్నపాత్ర. అమ్మ లాంటి ఈ వేప వృక్షాలకు మళ్లీ తెగులు వచ్చింది. రాష్ట్రంలో పలుచోట్ల ఈ చెట్లకు శిలీంధ్రాల వైరస్‌ సోకి ఎండిపోతున్నాయి.

Neem Trees
Neem Trees

By

Published : Dec 12, 2022, 12:33 PM IST

Neem Trees infected with Fungal Virus: ఔషధ గుణాలున్న వేపచెట్లకు మళ్లీ తెగులు వచ్చింది. రాష్ట్రంలో పలుచోట్ల ఈ చెట్లకు శిలీంధ్రాల వైరస్‌ సోకి ఎండిపోతున్నాయి. గతేడాది దేశవ్యాప్తంగా ఈ తెగులు సోకి ఎండిన వేపచెట్లు తిరిగి గత వేసవిలో కోలుకున్నా మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో ఎండుతున్నాయి. అధిక తేమ వల్ల శిలీంధ్రాలు గాలి, వర్షాలతో ఈ చెట్లపైకి వ్యాపించి ఎండు తెగులు అధికమవుతున్నట్లు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్‌ శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో తేలింది. ఎండిన చెట్ల భాగాలు, ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు, అక్కడి మట్టి నమూనాలను సేకరించి రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ప్రయోగశాలలో పరిశోధనలు చేశారు.

ఎండు తెగులును సూక్ష్మంగా పరిశీలిస్తే వాటిపై శిలీంధ్రాలు వదిలిన బీజాలు కోకొల్లలుగా కనిపించాయి. గతేడాది ఎండుతెగులు అధికంగా సోకిన వేపచెట్ల భాగాల్లో ఇవి పేరుకుపోయి మళ్లీ ఇప్పుడు వ్యాప్తి చెందుతున్నట్లు అంచనా వేశారు. ఫామోస్ఫిస్‌ అజాడిరక్టే, ఫ్యూసారియమ్‌ అనే పేరు గల రెండు శిలీంధ్రాలు చెట్లను నాశనం చేస్తున్నట్లు గుర్తించారు. ఇవి అధికంగా వ్యాపించిన చెట్లు ఎండిపోయి చివరికి కొన్నిచోట్ల చనిపోతున్నాయి. వీటిని నియంత్రించడానికి లీటరు నీటిలో ఒక గ్రాము కార్బండిజమ్‌ లేదా మ్యాంకోజెబ్‌, కార్బండిజమ్‌ మిశ్రమం 2.5 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై చల్లాలని వర్సిటీ పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ సూచించారు.

'ఎండుతెగులు సోకిన చెట్ల కాండం, కొమ్మలపై రంధ్రాలుంటే వాటిలో లీటరు నీటిలో 0.2 గ్రాముల థయామిధాక్సమ్‌ లేదా ఎసిటమాప్రిడ్‌ను కలిపి పోయాలి. తెగులు సోకిన చెట్లపై నీరు వేగంగా చల్లితే శిలీంధ్రాలు రాలిపోతాయి. చెట్లవేర్లకు నీరు సక్రమంగా పెట్టాలి. వాస్తవానికి ఈ తెగులు వర్షాకాలంలోనే ప్రారంభమై ఎండాకాలం నాటికి తగ్గుతున్నట్లు గుర్తించాం.'-డాక్టర్‌ జగదీశ్వర్‌

తొలుత ఈ తెగులు ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌ సమీప అటవీ ప్రాంతాల్లో మొదలై దేశమంతా వ్యాపించింది. కర్ణాటక సహా పలు రాష్ట్రాల వ్యవసాయ వర్సిటీలు ఈ తెగులుపై పరిశోధనలు చేసి శిలీంధ్రాల వ్యాప్తి వల్లనే చెట్లు ఎండుతున్నట్లు గుర్తించాయి. చాలావరకూ కోలుకుంటున్నాయని జగదీశ్వర్‌ చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details