Naveen murder case updates: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసుకు సంబంధించిన ఆధారాలతో పాటు మరిన్ని వివరాలు రాబట్టేందుకు మూడో రోజు మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం. నవీన్‌ను హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణ వరంగల్ వెళ్లి అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై కోదాడ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ బైక్‌ను స్థానికంగా పార్కింగ్ చేసి.. ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నానికి వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. ఆ ప్రాంతాలకు వెళ్లడానికి కారణాలు, అక్కడ ఎవరైనా సహకరించారా? లేక ఎవరి ఇంట్లోనైనా ఆశ్రయం పొందాడా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం తెల్లవారుజామున ప్రత్యేక బృందంతో హరిహరను కోదాడ తీసుకెళ్లారు. త్వరలోనే మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశముంది.
హరిహర కృష్ణ ఫోన్ డేటాపై పోలీసులు ఎక్కువగా దృష్టి సారించారు. నవీన్‌ను మూడు నెలల క్రితమే హత్య చేయాలని హరిహర నిర్ణయించుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ మూడు నెలల వ్యవధిలో ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడాడు.. బయట ఎవరిని కలిశాడు. ఎక్కువ సమయం ఎవరితో గడిపాడు. ఈ హత్యలో బయటి వ్యక్తుల హస్తం ఉందా? అనే కోణంలో హత్య వివరాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.