naveen murder case update: ప్రేమ ముందు స్నేహం ఓడిపోయింది. ప్రేమించిన యువతిని వేధిస్తున్నాడనే నెపంతో.. ప్రాణ స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌కు చెందిన హరిహర కృష్ణ.. ఫిర్జాదీగూడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితుడు నవీన్ నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ జూనియర్ కళాశాలలో చదువుకునే సమయంలో మంచి స్నేహితులు.
ఇంటర్ చదివే సమయంలో సమీపంలోని శ్రీ చైతన్య కళాశాలలో చదువుతున్న ఓ యువతితో నవీన్‌కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇంజినీరింగ్‌కు వెళ్లినా ఆమెతో నవీన్ ప్రేమాయణం కొనసాగింది. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చి రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత హరిహర కృష్ణతో ఆ యువతి స్నేహం కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న నవీన్... తన స్నేహితురాలిని ప్రశ్నించాడు. తరచూ ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ సందేశాలు పంపించాడు. నవీన్ ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఆ యువతి హరిహర కృష్ణకు తెలిపింది.
దీంతో హరిహర కృష్ణ, నవీన్‌పై ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా నవీన్‌ను అంతం చేయాలని కుట్ర పన్నాడు. గత మూడు నెలలుగా దీనికోసం పలు క్రైం వెబ్ సిరీస్‌లు చూశాడు. యూట్యూబ్‌లలోనూ హత్యలకు సంబంధించిన దృశ్యాలు చూశాడు. ఆ తర్వాత నవీన్ హత్యకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 17వ తేదీన నవీన్‌కు ఫోన్ చేసిన హరిహర కృష్ణ... హైదరాబాద్‌కు రావాల్సిందిగా సూచించాడు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని సూచించడంతో నల్గొండ నుంచి 17వ తేదీన ఉదయం హరిహర కృష్ణ వద్దకు వచ్చాడు. ఇద్దరూ కలిసి హరిహర కృష్ణ స్కూటీపై ఇంటర్ స్నేహితుడికి దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి భోజనం చేసి సినిమాకు వెళ్లారు. సినిమా తర్వాత స్నేహితుడు తన ఇంటికి వెళ్లిపోయాడు.
హరిహరకృష్ణ, నవీన్‌ను మూసారాంబాగ్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. నవీన్ నల్గొండ వెళ్తానని చెప్పగా... ద్విచక్ర వాహనంపై ఇద్దరూ బయల్దేరారు. ఎల్బీనగర్ మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్ వైపు వెళ్లారు. నిర్మానుష ప్రాంతంలోకి వెళ్లాక.. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత తమ స్నేహితురాలి గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇద్దరూ ఒకరినొకరు నెట్టుకున్నారు. తోపులాటలో కిందపడిపోయిన నవీన్‌పై కూర్చున్న హరిహర కృష్ణ గొంతు నులిమి ఊపిరాడకుండా చేశాడు. నవీన్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో నవీన్ తల, మొండెం వేరు చేశాడు. ఈ తర్వాత గుండె చీల్చాడు. పొట్ట భాగాన్ని పెకిలించి పేగులు బయటకు తీశాడు. మర్మాంగాలను కోశాడు.
17వ తేదీన వెళ్లిన నవీన్ రెండు రోజులైనా యూనవర్శిటీ హాస్టల్‌కు రాకపోవడంతో తోటి విద్యార్థులు హరిహరకృష్ణకు 19వ తేదీ ఫోన్ చేశారు. 17వ తేదీ రాత్రే తన దగ్గరి నుంచి వెళ్లినపోయినట్లు హరిహర కృష్ణ, నవీన్ హస్టల్ ఫ్రెండ్స్‌కు చెప్పారు. నవీన్ హాస్టల్‌కు రాలేదని తోటి విద్యార్థులు ఆయన తండ్రికి చెప్పారు. నవీన్ సమీప బంధువు చనిపోవడంతో వాళ్ల తల్లిదండ్రులు ఆ బాధలో ఉన్నారు. 20వ తేదీన హరిహర కృష్ణ, నవీన్ తండ్రి శంకర్‌కు ఫోన్ చేశాడు. నవీన్ కనిపించడం లేదని... పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామని ఏమీ ఎరుగనట్లు చెప్పాడు. స్నేహితుల ఇంటికి వెళ్లి ఉండొచ్చులే అని భావించిన నవీన్ తండ్రి శంకర్, మరుసటి రోజు వరకు ఎదురు చూశాడు. తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి నవీన్ గురించి ఆరా తీశాడు.