మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నవీన్ కుటుంబంతో పాటు 20ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. అల్మాస్‌గూడలో నివాసం ఉంటూ స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సరూర్‌నగర్ చెరువుకట్ట కింద నుంచి తపోవన్ కాలనీమీదుగా స్కూటీపై సరూర్‌నగర్ వైపు వెళ్తున్నాడు. నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లభించలేదు. చూస్తుండగానే చెరువులోకి కొట్టుకుపోయాడు.
20 గంటలపాటు శ్రమించి..
ఘటనపై సమాచారం అందిన వెంటనే జీహెచ్ఎంసీ, పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. అధునాతన బోట్లతో రాత్రి నుంచి తెల్లవారుజామున 3గంటల వరకూ గాలింపు కొనసాగించారు. చెరువులో బురద ఎక్కువగా ఉండటంటో తిరిగి మళ్లీ ఉదయం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో గాలించారు. 20 గంటలు శ్రమించిన తర్వాత చివరకు ఘటన జరిగిన స్థలానికి 100మీటర్ల దూరంలో చెరువులో నవీన్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నవీన్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సుమేధ ఘటన జరిగి వారం తిరగకముందే మరో ఘటన జరగడం వల్ల స్థానికులు జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలి..
నవీన్ వరదలో కొట్టుకుపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనా స్థలాన్ని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి పరిశీలించారు. నగర అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామంటున్న ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని... పరిహారంగా 50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.