దుర్గ, గౌరి, కాశీ అన్నపూర్ణ.. పేరేదయినా అన్నీ శక్తి రూపాలే. ఆజగదాంబ బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందనీ ప్రతి అవతారం నుంచీ మరో రెండు రూపాలు ఆవిర్భవించాయనీ అవే నవదుర్గలనీ చెబుతారు. ఈ తొమ్మిది రూపాలూ ఒకేచోట ఉన్న ఆలయాలు గోవా, మహారాష్ట్రల్లో ఉండగా, వారణాసిలో మాత్రం నవ దుర్గలకు ప్రత్యేక ఆలయాలు ఉండటం విశేషం. ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయాలు దసరా సమయంలో కిక్కిరిసిపోతుంటాయి.
1. శైలపుత్రి...
శరన్నవరాత్రుల్లో తొలిరోజున శైలపుత్రీ యశస్వినీ... అంటూ దుర్గామాతను ప్రకృతి రూపంగా ఆరాధిస్తారు. పుట్టింట జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి అగ్నిలో దూకి తనువును త్యజించిన పిదప పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికగా జన్మిస్తుంది. ఆమెనే శైలపుత్రి, హేమవతిగా పిలుస్తారు. నందివాహనాన్ని అధిరోహించిన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం, తలపై చంద్రవంక ఉంటాయి. శైలపుత్రి రూపంలో కొలిచే అమ్మవారి ఆలయం వారణాసిలోని మార్హియా ఘాట్‌లో ఉంది. నవరాత్రి సమయంలో అమ్మవారికిచ్చే మహా హారతి చూసేందుకు భక్తులు నలుదిక్కుల నుంచీ వస్తుంటారు. ఇక్కడి దుర్గామాత భక్తుల కష్టాలను చిటికెన వేలుతోనే పరిష్కరిస్తుందని ప్రశస్తి.
2. బ్రహ్మచారిణి...
రెండోరోజున బ్రహ్మచారిణీ రూపంలో పూజించే పరమేశ్వరి ఆలయం వారణాసిలోని గంగా ఘాట్ సమీపంలోనే ఉంటుంది. బాలాజీ ఘాట్ సమీపంలోనూ ‘మా బ్రహ్మేశ్వర్’ పేరుతో మరో ఆలయంకూడా ఉంది. ఆ పరమ శివుడిని భర్తగా పొందేందుకు ఘోర తపస్సు చేసిన పార్వతీదేవికి ప్రతీకగా తెల్లచీర కట్టుకుని కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలం ధరించిన లోకమాత రూపాన్ని దర్శించుకునేందుకు ఏడాది పొడవునా భక్తులు వస్తూనే ఉంటారు.
3. చంద్రఘంటాదేవి...
మూడో రోజున ఆరాధించే జగజ్జనని ఆలయం వారణాసిలోని జైత్‌పురిలో ఉంది. తన శిరస్సున ఉన్న చంద్రుడిని చూసి ముచ్చటపడ్డ పార్వతీదేవి కోరికను తీర్చేందుకు ఆ చంద్రుడిని ఆమెకు అలంకరించాడట శంకరుడు. ఆ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంతో ఆమెకు చంద్రఘంట అని పేరు. వ్యాఘ్ర వాహనధారియై పది చేతుల్లో అస్త్రాలనూ కమలాన్నీ కమండలాన్నీ ధరించి మూడో నేత్రాన్ని తెరిచి యుద్ధానికి సన్నద్ధమైన ముద్రలో ఉన్న అమ్మ ఘంటానాదం విన్నంతనే రాక్షసులు గడగడలాడారట. అయితే చంద్ర ఘంటాదేవి ఆలయంలో పాలరాతితో చేసిన ఆ మహేశిని మూర్తి ప్రశాంత వదనంతో దర్శనమిస్తూ భక్తుల భయాలని పోగొడుతుందని పేరు.
4. కూష్మాండాదేవి...
నాలుగో రోజున ఆరాధించే దుర్గామాత కూష్మాండ రూపంలో దర్శనమిస్తుంది. వివాహమైన తరవాత పార్వతీదేవికి తాను మహాశక్తి స్వరూపమనీ, సృష్టిలోని సకల ప్రాణులకీ తనే మూలమని తెలుసుకునేలా చేస్తాడు శంకరుడు. అప్పుడామె కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద, జపమాల... ధరించి అష్టభుజిగా రూపాంతరమెత్తిందట. వారణాసిలో స్వయంభూ రూపంలో వెలిసిన కూష్మాండ దుర్గ అమ్మవారికి నాటి రాణి అహల్య బాయ్ హోల్కర్ 18వ శతాబ్దంలో ఆలయం కట్టించింది. ఉత్తరాది ఆలయాలకు భిన్నంగా ఈ ఆలయం నాగర శైలిలో ఉంటుంది. ఏటా నవరాత్రి సమయంలో ఇక్కడికి భక్తులు పోటెత్తుతారు. కాశీలో ఉన్నట్లే కాన్పూర్‌లోని ఘాటంపుర్‌లోనూ కూష్మాండదేవి ఆలయం ఉంది. ఇది అత్యంత ప్రాచీన కాలానికి చెందినది. ఈ ఆలయంలోని జగన్మాత అండ పిండ బ్రహ్మాండ రూపంలో దర్శనమిస్తుంది.
5. స్కందమాత...
ఐదోరోజున కొలిచే ఆ లోకమాత స్కందుడి తల్లిగా భక్తులకు దర్శనమిస్తుంది. అన్నపూర్ణా దేవి మందిరం సమీపంలోనే ఉన్న ఈ ఆలయంలో కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకుని సింహవాహనంమీద ఆసీనురాలైన ఆ జగదీశ్వరీ దేవికి దసరా సమయంలో ఐదోరోజున ప్రత్యేక పూజలూ యజ్ఞాలూ నిర్వహిస్తారు. ఇక్కడి అమ్మవారికి చేసిన పూజలు కుమారస్వామికీ చెందుతాయట. చతుర్భుజాలతో వెలిసిన ఈ దుర్గమ్మను శక్తిమంతమైనదిగా విశ్వసిస్తారు. సంపదకీ తెలివితేటలకీ ప్రతీకగానూ సూర్యమండల అధిష్టాత్రిగానూ భావించే స్కందమాతను కొలిచినవాళ్లు తేజస్సుతో వెలుగొందుతారనీ ప్రతీతి.
6. కాత్యాయని...
ఆరో రోజున కొలిచే కాత్యాయనీ మాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది. భద్రకాళి అవతారమెత్తి ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ణి వధించింది. దివ్యమైన ఈమె స్వరూపాన్ని పూజిస్తే ధర్మార్థకామమోక్షములనే చతుర్విధ పురుషార్థ ఫలాలూ సిద్ధిస్తాయనీ జన్మజన్మల పాపాలు తొలగిపోతాయనీ చెబుతారు. నాలుగు చేతులతో ఉన్న ఈ అమ్మవారూ సింహవాహినిగానే సాక్షాత్కరిస్తారు. కాశీతోపాటు కర్ణాటకలోని అవెర్సలో ఉన్న కాత్యాయనీ బాణేశ్వర్ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.