Natural Ways To Get Rid Of Mosquitoes in Telugu : సాయంత్రం 6 గంటలు దాటితే చాలు దోమల దండయాత్ర మొదలవుతుంది. ఆ దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ఆల్ అవుట్, గుడ్ నైట్ వంటి దోమలను సంహరించే రసాయనిక వస్తువులను వాడుతాం. అవి వాటిని చంపడమేమో గానీ.. మొదట మన ప్రాణాలనే హరిస్తాయి. దోమకాటు కొన్ని వారాలకు ఎఫెక్టు చూపితే.. ఈ రసాయనాల వల్ల దీర్ఘకాలంలో తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయి. అలాంటి రసాయనాలకు బదులుగా ప్రకృతి సిద్ధమైన వాటితో దోమల బెడద నుంచి శాశ్వతంగా ముక్తి పొందుదాం. అవేంటో తెలుసుకుందాం రండి..
కర్పూరం, వేప ఆకులు : ప్రతిరోజు రాత్రి వేళల్లో మస్కిటో కాయిల్స్ వెలిగించే బదులు.. తలుపులు, కిటికీలు కాస్త మూసి కర్పూరం, వేప ఆకులు కలిపి పదిహేను నిమిషాల పాటు పొగ వేస్తే చాలు.. దోమల అనేది ఇంట్లో అడుగు పెట్టాలంటే భయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఒక వేళ వేపాకులు లేకపోతే సింపుల్గా కర్పూరంతో పొగ వేస్తే సరిపోతుంది.
ఆవాల పొడి, వేప ఆకుల పొడి, సముద్రపు ఉప్పు ఈ మూడింటిని సమాన మోతాదులో తీసుకుని.. తర్వాత నాలుగు బొగ్గులను వేడి చేసుకొని ఒక మట్టిపాత్రలో వేసుకోవాలి. కిటికీలు, తలుపులు అన్నీ మూసి పొడిని కొంచెం కొంచెంగా బొగ్గులపై చల్లుకుంటూ వెళ్లాలి. ఇలా వచ్చే పొగను ఇల్లంతా విస్తరించనివ్వాలి. ఈ ఔషధం కూడా దోమల్ని తరిమికొడుతుంది.
బొగ్గు అందుబాటులో లేకపోతే అరోమాల్యాంప్స్ :ఒకవేళ బొగ్గు అందుబాటులో లేకపోతే అరోమా ల్యాంప్స్లో కర్పూరం, సాంబ్రాణి, యూకలిప్టస్ ఆయిల్, వేప నూనె, లెమన్ గ్రాస్ నూనె, లావెండర్ నూనె, తేయాకు నూనె.. వీటన్నింటిలో ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది. వీటి వల్ల గది మొత్తం సువాసన వెదజల్లడమే కాదు దోమల బెడదా ఉండదు.
వెల్లుల్లిపాయలు : నాలుగు వెల్లుల్లిపాయలను తీసుకొని వాటిని బాగా దంచి, ఏదైనా కొంచెం నూనె లేక నెయ్యితో పాటు కాస్త కర్పూరం కలుపుకొని వెలిగించుకోవాలి. అప్పుడు వచ్చే పొగకు దోమలు చనిపోతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. మస్కిటో మ్యాట్స్, లిక్విడ్ రీఫిల్స్ కంటే ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు.