తెలంగాణ

telangana

ETV Bharat / state

కదం తొక్కిన కార్మికలోకం.. రాష్ట్రమంతటా రాస్తారోకోలు, ర్యాలీలు - దేశవ్యాప్తంగా రెండు రోజుల కార్మిక సమ్మె

Nationwide Strike: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలో తొలి రోజు సమ్మె ప్రశాంతంగా ముగిసింది. ర్యాలీలు, రాస్తారోకోలతో రాష్ట్రమంతటా ఆందోళనలు సాగాయి. సింగరేణి గనులు బోసిపోయాయి. మంగళవారం కూడా కార్మికులు నిరసనలు కొనసాగించనున్నారు.

కదం తొక్కిన కార్మికలోకం.. రాష్ట్రమంతటా రాస్తారోకోలు, ర్యాలీలు
కదం తొక్కిన కార్మికలోకం.. రాష్ట్రమంతటా రాస్తారోకోలు, ర్యాలీలు

By

Published : Mar 28, 2022, 8:14 PM IST

కదం తొక్కిన కార్మికలోకం.. రాష్ట్రమంతటా రాస్తారోకోలు, ర్యాలీలు

Nationwide Strike: దేశవ్యాప్తంగా రెండు రోజుల కార్మిక సమ్మెలో భాగంగా రాష్ట్రంలో కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హైదరాబాద్‌లో ఎల్​ఐసీ సౌత్‌ సెంట్రల్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. 32 లక్షల కోట్ల నికర ఆస్తులున్న జీవిత బీమా సంస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. కుత్బుల్లాపూర్‌, పటాన్‌చెరులో జరిగిన నిరసనల్లో తెరాస ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హైదరాబాద్‌ ఆటో యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. బోరబండలో జీహెచ్​ఎంసీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సింగరేణిలో నిలిచిన ఉత్పత్తి

కార్మికుల సమ్మెతో సింగరేణిలో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. అత్యవసర సిబ్బంది మినహా కార్మికులెవరూ విధులకు హాజరు కాలేదు. భూపాలపల్లి, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌, రామగుండం ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి ముగిసిపోయింది. ఉపరితల గనుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ జరగనివ్వబోమని కార్మికులు స్పష్టం చేశారు. సమ్మెతో సింగరేణివ్యాప్తంగా సుమారు 32 కోట్ల నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అన్ని జిల్లాల్లోనూ కనిపించిన సమ్మె ప్రభావం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సమ్మె ప్రభావం కనిపించింది. ఖమ్మంలో బస్‌ డిపో ఎదుట బైఠాయించి సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. కరీంనగర్‌లో నిరసన ప్రదర్శన చేశారు. నల్గొండ, నిజామాబాద్‌, సంగారెడ్డి సహా అన్ని చోట్లా కార్మికులు ఆందోళనల్లో పాల్గొన్నారు. కార్మికులను బానిసలుగా మార్చేలా కేంద్ర చట్టాలు ఉన్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా సంఘాలు నిరసనలు తెలిపాయి. మంగళవారం కూడా కార్మికులు ఆందోళనలు కొనసాగించనున్నారు. కేంద్రం దిగిరాకుంటే మరింత ఉద్ధృతంగా పోరాడతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details