ఆటలంటే వీడియో గేమ్‌లే కాదు గురూ ఆటలు శరీరానికే కాదు... మనసుకి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని కల్గిస్తాయి. పిల్లల్లో మానసిక ధైర్యాన్ని పెంచుతాయి. అసలు ఆటలు పిల్లల్నే కాదు... పెద్దవాళ్లనూ కట్టిపడేస్తాయి. సెలవులు వస్తే చాలు... పిల్లలంతా ఆటలాడుతుంటారు. అయితే ఇప్పుడు ఎన్నో ఆటలు అంతరించిపోయాయి. నేటి తరం పిల్లలకు ఆటలంటే స్మార్ట్ఫోన్లలో గేమ్స్ ఆడటమే అనుకునే దుస్థితి వచ్చింది.
ర్యాంకులే జీవితం అన్నట్లుగా..
1, 2, 3, 4 ఇవేంటి అనుకుంటున్నారా...పోటీ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదవాలని ర్యాంకులు వస్తేనే జీవితం అన్నట్లుగా పెంచుతున్నారు. పొరపాటున ఆ పిల్లాడు ఏదైనా గేమ్ ఆడుతూ కనిపిస్తే... ఇక వాడికి మూడినట్లే. చదువు... పేరుతో పిల్లలకు ఆటల్ని దూరం చేస్తున్నారు.
నో ప్లేగ్రౌండ్స్...
అంతేనా... ఇప్పటి స్కూళ్లలో ప్లేగ్రౌండ్స్ కరవయ్యాయి. ఆనాటి పాఠశాలలో ఉదయం, సాయంత్రం పిల్లలకు వ్యాయమం చేయించడానికి ఓ డ్రిల్ మాస్టార్ ఉండేవాడు.. ఆటలు ఆడుకోవడానికి ప్రత్యేక సమయం కేటాయించేవారు. పిల్లలు ఆటలాడుతూ... ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆటలాడే పిల్లలకు జీవితంలో ఏదైనా సమస్య వస్తే మానసిక ఒత్తిడికి గురై కుంగిపోకుండా ఉంటారని.. నిపుణులు చెబుతున్నారు.
ఆటలకు దూరంగా.. స్థూలకాయానికి దగ్గరగా...
పిల్లలు కాస్త సమయం దొరికితే... స్మార్ట్‌ఫోన్స్‌లో గేమ్‌లు ఆడుతున్నారు. పిల్లల్లో ఊబకాయానికి, చిన్నవయసులోనే చూపుమందగించి కళ్లజోడు రావటానికి ఈ వీడియోగేములే కారణమవుతున్నాయి. ఫలితంగా విపరితమైన మానసిక ఒత్తిడికి గురవుతారని వైద్యులు చెబుతున్నారు.
తల్లిదండ్రులే కాదు... ప్రభుత్వ వైఖరి అలాగే ఉంది. చైనా లాంటి దేశాల్లో ఆటలను నిర్బంధ విద్యగా చేర్చారు. ప్రతి ఒక్కరు అక్కడ ఆటలు ఆడాల్సిందే. మన దేశంలో మాత్రం కనీసం ఆడేవారు కనిపిస్తే ప్రోత్సహించే నాథుడే ఉండడు. దేశానికి స్వర్ణాలు రాలేదని బాధపడుతూ ఉంటాం తప్ప... మన ఇంట్లోనే ఓ క్రీడాకారుణ్ని తయారు చేద్దామనే ఆలోచన ఉండదు. ప్రభుత్వాలు కూడా ఆటలపై దృష్టి పెడితే... ప్రతి ఇంట్లో ఓ సచిన్ టెండూల్కర్... ఓ ధ్యాన్‌చంద్, పీవీ సింధు లాంటి వారు ఉంటారు.
ఇవీ చూడండి:జ్వలించిన తపన.. నిత్యసాధనే నిచ్చెన