BJP leader Laxman: తెరాస కాంగ్రెస్‌కు తోక పార్టీలాగా వ్యవహరిస్తోందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని భద్రతా విషయంలో కేటీఆర్ బాధ్యతాలేకుండా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిశారు.
ప్రధాని భద్రత విషయంపై గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రధానికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఈనెల10న రాష్ట్రవ్యాప్తంగా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తెరాస వత్తాసు పలికినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ ప్రధాన మంత్రి భద్రత విషయంలో అవహేళనగా మాట్లాడితే సహించేందిలేదన్నారు. ప్రధాన మంత్రి భద్రత విషయంలో గవర్నర్‌కు అన్ని విషయాలు వివరించామని.. సానుకూలంగా స్పందించారని లక్ష్మణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింతగా ఉద్యమిస్తామన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, భాజపా నేతలు ప్రకాశ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.