రోజురోజుకు విజృంభిస్తోన్న కరోనా వైరస్‌తో ప్రజలు రకరకాల ఆందోళనల్లో ఉన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు విషయాలను జాతీయ పౌష్టికాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత పలు ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రశ్న: శరీరంలో విటమిన్లు బాగుంటే కరోనాను ఎదుర్కోవచ్చని ఇష్టానుసారంగా విటమిన్, జింక్ తదితర గోలీలను మింగుతున్నారు. ఇలా చేయొచ్చా?
సమాధానం: ఇది వాస్తవం కాదు. ఎన్‌ఐఎన్ పరిశీలనలో దేశంలో 20 శాతం మందిలో విటమిన్ లోపం ఉంది. 50 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పండ్లు, కూరగాయలు తినడం ద్వారా దీన్ని అధిగమించవచ్చు. వైద్యుల సూచన మేరకే విటమిన్ గోలీలను మింగాలి.
ప్రశ్న: కరోనా వేళ రోజువారీ తీసుకోవాల్సి ఆహారమేంటి?
సమాధానం: రోజూ కనీసం 400-500 గ్రాముల వరకు పండ్లను తినాలి. అందులో 100-200 గ్రాముల వరకు నిమ్మ, జామకాయలు లాంటివి ఉండాలి. పాలు, పెరుగు, గింజ ధాన్యాలు, నట్స్ తీసుకోవాలి.
ప్రశ్న: రోజూ నిద్రలేవగానే వేడి నీళ్లు తాగాలా?
సమాధానం: వేడి నీళ్లు తాగినంత మాత్రాన శరీరంలోని వైరస్ నశించదు. అలా అని తాగొద్దని కాదు. శీతలపానీయాల కంటే వేడి నీరు మేలే.
ఇవి తినండి.. వీటిని తగ్గించండి!
- వంటల తయారీకి రోజూ రెండు రకాల నూనెలు ఉపయోగించాలి.
- పసుపు, మిరియాలు లాంటివి తీసుకుంటే వైరస్‌ను ఎదుర్కొనే శక్తి వస్తుంది. అల్లం, వెల్లుల్లితోనూ ఫలితం ఉంటుంది.
- మైదా పిండి, చక్కెర, ఉప్పు, వనస్పతి దాదాపుగా తగ్గించాలి.
ఆహారమే ఆరోగ్యానికి రక్ష - పుష్కలంగా పోషకాలు ఉన్న పదార్థాలను రోజూ తినే ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. ఆహారంలో సగభాగం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, దుంపకూరలు. తృణధాన్యాలు, పప్పుదినుసులు, మాంసాహారం, గింజలు తప్పనిసరి.
- ఒక వ్యక్తి రోజుకు 30 గ్రాముల మించి కొవ్వు పదార్థం తీసుకోకూడదు. రోజుకు 5 గ్రాముల ఉప్పు చాలు. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
- తగిన మోతాదులో నీరు తాగాలి. డీహైడ్రేషన్‌కు గురిగాకుండా చూసుకోవాలి. శారీరక వ్యాయామం, యోగ ఒత్తిడిని తగ్గిస్తాయి. వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. పొగతాగటం, మద్యపాన అలవాట్లకు దూరంగా ఉండాలి.
ఇవీ చూడండి:దొంగకు కరోనా ఉంటే.. వణికిపోతున్న పోలీసులు.!