తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయ అత్యుత్తమ అవార్డు - Singareni award latest news

సింగరేణి సంస్థకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఫ్లైయాష్​ను 100 శాతానికి పైగా సద్వినియోగం చేసినందుకు గానూ ఈ అవార్డు వరించింది. ఫ్లైయాష్‌ వినియోగంపై గోవాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి సదస్సులో ఆ సంస్థ డైరెక్టర్​ డి.సత్యనారాయణరావు అవార్డును అందుకున్నారు.

సింగరేణికి జాతీయ స్థాయి అవార్డు
సింగరేణికి జాతీయ స్థాయి అవార్డు

By

Published : Apr 10, 2021, 10:27 PM IST

సింగరేణి సంస్థను అత్యుత్తమ అవార్డు వరించింది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే ఫ్లైయాష్​ను 100 శాతానికి పైగా సద్వినియోగం చేసినందుకు గుర్తింపుగా సింగరేణి థర్మల్‌ విద్యుత్​ కేంద్రానికి ఈ అవార్డు లభించింది. ఫ్లైయాష్‌ వినియోగంపై మిషన్‌ ఎనర్జీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గోవాలో రెండు రోజులుగా జరిగిన అంతర్జాతీయ స్థాయి సదస్సు ముగింపు సందర్భంగా సింగరేణి డైరెక్టర్‌ డి.సత్యనారాయణరావు ఈ అవార్డును అందుకున్నారు. 500 మెగావాట్ల పైబడి విద్యుత్​ను ఉత్పత్తి చేస్తున్న థర్మల్‌ ప్లాంట్ల విభాగంలో సింగరేణి ఈ అవార్డును అందుకుంది.

సింగరేణికి అవార్డు రావడం పట్ల ఆ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్‌ విద్యుత్​ కేంద్రంలో ఫ్లైయాష్‌, బాటంయాష్​లను వంద శాతం సద్వినియోగం చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా మొదటి నుంచే కృషి చేస్తున్నామని.. అందుకు గుర్తింపుగా జాతీయ స్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.

107 శాతం వినియోగం

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే ఫ్లైయాష్​ను ప్రధానంగా సిమెంట్​ కంపెనీలకు రవాణా చేస్తున్నారు. సింగరేణి 2020-21లో 16.86 లక్షల టన్నుల ఫ్లైయాష్​ను సిమెంటు కర్మాగారాలకు రవాణా చేసింది. తద్వారా 107 శాతం ఫ్లైయాష్‌ వినియోగం జరిగిందని సంస్థ వెల్లడించింది. కేశోరాం, ఓరియంట్‌ తదితర 10 సిమెంటు కంపెనీలు సింగరేణి ఫ్లైయాష్​ను వినియోగిస్తున్నాయి. ఎన్టీపీసీ, ఎస్‌సీఎల్‌ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు అదానీ, టాటా, జేకే వంటి సుమారు 150 ప్రైవేట్​ థర్మల్‌ విద్యుత్ కేంద్రాలను మించి సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఈ అవార్డును పొందడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఇదీ చూడండి: ఫూలే ఆలోచనా విధానాన్నే ప్రభుత్వం అమలుచేస్తోంది: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details