దేశంలో కొవిడ్ వ్యాప్తి, వైరస్ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలితాలు ఇస్తున్నాయనే వివరాలను తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా సీరో సర్వేలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా చేపట్టిన సర్వేలో.. దేశ వ్యాప్తంగా 67 శాతం మందిలో కొవిడ్ సీరో పాజిటివ్‌గా తేలినట్టు ప్రకటించింది. ఇక రాష్ట్రంలో ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ ఎన్ఐఎన్.. జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో ఈ సర్వేని జూన్‌లో చేపట్టగా... ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం... సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు గుర్తించినట్టు స్పష్టం చేసింది. ఈ సర్వే కోసం అన్ని వయసుల వారి రక్త నమూనాలు సేకరించి విశ్లేషించారు. అయితే 6 నుంచి 9 ఏళ్ల లోపు 55 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలు గుర్తించగా.. 61 శాతం మంది పెద్దవారిలో యాంటీబాడీలు ఉన్నాయని తెలిపింది. ఇక హెల్త్ కేర్ వర్కర్లలో ఏకంగా 82.4 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడమే ఇందుకు కారణమై ఉండొచ్చని.. అభిప్రాయపడింది.
కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు గానూ ఐసీఎంఆర్ గతంలో సీరో సర్వే చేసిన జిల్లాల్లోనే.. మరోమారు సర్వే చేపట్టడం గమనార్హం. ఇప్పటికే ఆయా జిలాల్లో గతేడాది మే, ఆగస్ట్, డిసెంబర్ నెలల్లో సర్వే చేపట్టారు. అయితే మే నెలలో చేసిన సర్వేలో 0.33 శాతం, ఆగస్టులో 12.5 శాతం, డిసెంబర్లో 24.5 శాతం మందిలో యాంటీబాడీలు గుర్తించగా.. తాజా సర్వేలో ఏకంగా 60 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందటం గమనార్హం. ఎన్ఐఎన్ తాజా నివేదిక ప్రకారం.. జనగామలో 58.76, నల్గొండలో 55.88, కామారెడ్డిలో అత్యధికంగా 65.61 శాతం మంది సీరో పాజిటివ్‌గా గుర్తించారు.