రుణమాఫీ పథకం కింద రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు అవరోధాలు తొలగాయి. ఆన్‌లైన్‌లో రైతుల వివరాల పరిశీలనకు సంబంధించిన జాతీయ సమాచార కేంద్రం(ఎన్‌ఐసీ) కంప్యూటర్ సర్వర్ సామర్థ్యాన్ని మంగళవారం పెంచారు. ఈ సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో ఇక సొమ్మును నాలుగైదు రోజుల్లో వేగంగా జమ చేయడానికి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
తొలిదశ..
2018 డిసెంబరు 11 నాటికి బ్యాంకుల్లో రూ.25 వేలలోపు రుణబకాయి ఉన్న రైతులకు తొలిదశ కింద సొమ్ము జమ చేస్తున్నారు. వీరికోసం రూ.1210 కోట్లను ప్రభుత్వం వ్యవసాయశాఖకు ఇచ్చింది. ఇప్పటివరకూ 1.96 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.299 కోట్లను వేశారు. మిగిలిన వారికి వేయడానికి ఒక్కో రైతు కుటుంబ సభ్యుల బకాయిల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పరిశీలిస్తున్నారు. రైతు, అతని భార్య, పిల్లల పేరిట ఉన్న మొత్తం రుణం రూ.25 వేలలోపు ఉంటే వారికి తొలిదశలో డబ్బు జమ అవుతుంది.