Telangana Regional Ring Road : ప్రాంతీయ రింగు రోడ్డు(RRR) ఉత్తర భాగంలో తొలివిడతగా సంగారెడ్డి నుంచి తూప్రాన్ వరకు నిర్మించే రహదారి కోసం భూ సేకరణకు రంగం సిద్ధమవుతోంది. ఆ మార్గం వెళ్లే ప్రాంతాల్లో భూముల ప్రస్తుత యజమానులు ఎవరన్నది నిర్ధారించే సర్వే చేపట్టేందుకు వీలుగా జాతీయ రహదారుల సంస్థ కసరత్తు చేపట్టింది. త్వరలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 3-D నోటిఫికేషన్ జారీ అయింది.
ఆ ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తం చెల్లించాలి :భూ యజమానుల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి వాటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తరవాత 3-G నోటిఫికేషన్ జారీచేస్తారు. ఈ మార్గం నిర్మాణానికి సుమారు 236 ఎకరాలు సేకరించాల్సి ఉంది. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు 158.50 కిలోమీటర్ల ఉత్తర భాగం రహదారిని నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇందులో తొలి విడతగా 60 కిలోమీటర్ల రహదారిని నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. భూ సేకరణకు అయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తాన్ని చెల్లించాలి. ఆ మొత్తాన్ని దశలవారీగా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేయటంతో ఉత్తర భాగాన్ని దశలవారీగా చేపట్టాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది.